AP CM Chandrababu Speech In NDRF Formation Day: ఎన్నికల సమయానికి ఏపీ వెంటిలేటర్‌పై ఉందని.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రస్తుతం ఆ పరిస్థితి నుంచి బయటపడిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. విజయవాడ సమీపంలోని కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకల్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌‌తో (Pawan Kalyan) కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్డీఆర్ఎఫ్ సేవలను కొనియాడారు. 'ఏ విపత్తు వచ్చినా ఎన్డీఆర్ఎఫ్ మొదట గుర్తొస్తుంది. జపాన్, నేపాల్, తుర్కియేలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సేవలు అందించింది. 5 రాష్ట్రాలకు శిక్షణ ఇచ్చేలా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్ఐడీఎం) ప్రాంగణాన్ని ఏర్పాటు చేశాం. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్, ఎన్ఐడీఎం ప్రాంగణాలకు 50 ఎకరాల భూమి కేటాయించాం. వీటిని పూర్తి చేసిన కేంద్రానికి ధన్యవాదాలు. దేశంలో సమస్యల పరిష్కారానికి అమిత్ షా పట్టుదలతో కృషి చేస్తున్నారు.' అని సీఎం పేర్కొన్నారు.

'ఏప్రిల్ నాటికి పోలవరం'

'రాజధాని అమరావతికి కేంద్రం నుంచి రూ.15 వేల కోట్లు ఇచ్చారు. ప్రస్తుతం పనులు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కుకు రూ.11,440 కోట్ల ఆర్థిక సాయం చేసి ప్రాణం పోశారు. ఇటీవలే విశాఖ రైల్వే జోన్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. దేశ అభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకు కేంద్రం మద్దతు ఇంకా కావాలి. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు ఇవ్వాలి. కేంద్ర మార్గదర్శకత్వంలో పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు జరుగుతున్నాయి. కేంద్రం మద్దతుతో ఏప్రిల్ 2027 నాటికి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం.' అని సీఎం చంద్రబాబు (CM Chandrababu) పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి పవన్ ధన్యవాదాలు

అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాట్లాడారు. ఎన్డీఆర్ఎఫ్ లక్షలాది మందిని ప్రమాదాల నుంచి కాపాడిందని అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్, అచ్యుతాపురం సెజ్ ఘటనలు.. విజయవాడ వరదల సమయాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దక్షిణ భారత్‌కు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ ప్రధాన కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేయడంపై ప్రధాని మోదీ, అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు.

Also Read: Danthapuri Fort: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా బుద్ధుడి దంతం దొరికిన ప్రాంతం, అభివృద్ధికి నోచుకోని దంతపురి క్షేత్రం