బాలికపై కిరోసిన్ పోసి హత్య చేసిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. బాధిత బాలిక తల్లిదండ్రులకు పోక్సో చట్టం నిర్దేశించిన ప్రకారం రూ. 7,50,000 పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది.
కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ కు సంబంధించిన కేసు తుది విచారణ ముగిసింది. బాలికను హత్య చేసిన కేసులో స్పెషల్ కోర్ట్ ఫర్ స్పీడీ ట్రైల్ ఆఫ్ అఫెన్సెస్ అండర్ ద పోక్సో యాక్ట్ ప్రకారం తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ స్పెషల్ జడ్జి, పోక్సో కోర్టు న్యాయమూర్తి ఎల్.వేంకటేశ్వర రావు నిందితుడు ముక్కుడుపల్లి నవీన్ కుమార్ @ నవీన్ కు శుక్రవారం జీవిత ఖైదు విధించడంతో పాటు రూ. 2250 జరిమానా కింద విధిస్తూ తీర్పు ఇచ్చారు. అయితే ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పితాని శ్రీనివాసరావు తమ వాదనలను బలంగా వినిపించారు. బాధిత బాలిక తల్లిదండ్రులకు పోక్సో చట్టం నిర్దేశించిన ప్రకారం ఏడున్నర లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలిచ్చింది.
2013 సంవత్సరంలో నమోదైన కేసులో కాకినాడ జిల్లా పిఠాపురం, దేవాలయం గుడి వీధిలో బాలికను పిఠాపురం పట్టణం కత్తులగూడెనికి చెందిన నిందితుడు ముక్కుడుపల్లి నవీన్ కుమార్ @ నవీన్ ప్రేమిస్తున్నానని ఫోన్ ద్వారా వేధించాడు. తనను ప్రేమించాలని బలవంతం చేయడంతో బాధిత బాలిక అతని ప్రపోజల్ ను నిరాకరించింది. ఆమె తల్లిదండ్రులు వారి కుమార్తెను వేధించవద్దని నిందితున్ని హెచ్చరించారు. అయినా అతని ప్రవర్తన మారకపోవడంతో ఆమెను చదువు మాన్పించేసి ఇంటి వద్ద ఉంచారు.
ఆ తరువాత బాలిక తల్లిదండ్రులు అనపర్తి గ్రామానికి చెందిన వ్యక్తితో ఆమె వివాహం నిశ్చయించారు. క్రమంలో 2013 మార్చి 13న ఉదయం బాలిక తల్లిదండ్రులు పెళ్లికి కొత్త బట్టలు కొనడానికి రాజమండ్రి వెళ్ళగా, బాధిత బాలిక ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఇంట్లోకి బలవంతంగా చొరబడి, తన లైంగిక కోరికను తీర్చాలని ఆమెపై బలవంతంగా అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె అతని నుండి తప్పించుకొని వంట గదిలోకి పరిగెత్తింది. నిందితుడు కూడా ఆ గదిలోకి తన కోరిక తీర్చాలంటూ బలవంతపెట్టాడు. ఇంటి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడంతో బాలికను వేరొకరికి కూడా దక్కనీయను అంటూ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టి అంటించి పారిపోయాడు. తీవ్ర కాలిన గాయాలతో బాధితురాలు చికిత్స పొందుతూ వారం రోజుల తరువాత మృతి చెందింది.
ఈ సంఘటనపై అప్పటి ఎస్సై ఎస్వీవీ లక్ష్మీ నారాయణ కేసు నమోదు చేశారు. తాజాగా కోర్టు తీర్పుతో నిందుతుడైన నవీన్ కుమార్ కు జీవిత ఖైదు, జరిమానా విధించడంతో ప్రజాసంఘాలు బాధితురాలు కుటుంబం బాధితురాలికి న్యాయం జరిగిందంటూ హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థినిపై యువకుడి అత్యాచార యత్నం
శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్ల రాళ్లపల్లిలో దారుణం చోటు చేసుకుంది. అభం శుభం ఎరుగని ఆరవ తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసులు అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. మాయ మాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆపై అత్యాచారం చేయబోయాడు. అయితే బాలిక గట్టిగా ఏడ్వడంతో సదరు నిందితుడు పారిపోయాడు. విషయం తెలియడంతో విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.