MLAs Poaching Case :  ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి ఇస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ  ప్రభుత్వం దాఖలుచేసిన  అప్పీల్ పిటిషన్ పై సోమవారం హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.  సిబిఐ కి ఇవ్వాలా... వద్దా... అనే అంశం పై సోమవారం హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. సింగిల్  బెంచ్ జడ్జి ఆదేశాలను కొట్టేస్తే.. సిట్ ఈ కేసులో విచారణ తిరిగి ప్రారంభించనుంది. సింగిల్ బెంచ్ ఆదేశాలను సమర్థిస్తే సీబీఐ కొత్తగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించే అవకాశం ఉంది. రానున్న రాజకీయ పరిణామాలకు ఈ కేసు అత్యంత కీలకం కావడంతో... సోమవారం హైకోర్టు వెలువరించబోయే తీర్పుపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. 


జనవరి 18వ తేదీన  ఈ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ప్రభుత్వ తరపు న్యాయవాది లిఖిత పూర్వక వాదనలకు సమయం కోరారు. దీంతో జనవరి  30వతేదీ వరకూ హైకోర్టు చాన్స్ ఇచ్చింది. ఇప్పుడు ఆ లిఖిత పూర్వక వాదనలను పరిశీలించి హైకోర్టు తీర్పు చెప్పనుంది.  గతంలో సింగిల్  బెంచ్ ఫామ్ హౌస్ కేసును సీబీఐకి ఇస్తూ తీర్పు చెప్పింది.  ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్ట్‌ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. సిట్ దర్యాప్తు కొనసాగించేలా ఆదేశాలివ్వాలంటూ డివిజన్ బెంచ్లో పిటిషన్ దాఖలు చేసింది. సీబీఐకీ కేసు బదిలీ నిలిపివేయాలని ఆ పిటీషన్ లో కోరింది. 


ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు 2022 డిసెంబర్ 26న తీర్పునిచ్చింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని ..ముఖ్యమంత్రికి  సాక్ష్యాలు ఎవరు ఇచ్చారో చెప్పడంలో సిట్ విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దర్యాప్తు సమాచారం సీఎంకు చేరవేతపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇన్వెస్టిగేషన్ అధికారుల దగ్గర ఉండాల్సిన ఆధారాలన్నీ మీడియాకి  ప్రజల వద్దకు వెళ్లిపోయాయని పేర్కొన్నారు. దర్యాప్తు సమాచారాన్ని మీడియా తో సహా ఎవరికీ చెప్పకూడదన్నారు. దర్యాప్తు ప్రారంభ దశలోనే కీలక ఆధారాలు బహిర్గతమయ్యాయని కామెంట్ చేశారు. సిట్ చేసిన ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా కనిపించలేదని తెలిపారు. దర్యాప్తు ఆధారాలను  బహిర్గతం చేయడం వల్ల విచారణ సక్రమంగా జరగదన్నారు. ఆర్టికల్ 20, 21 ప్రకారం  న్యాయమైన విచారణతో పాటు దర్యాప్తు కూడా సరైన రీతిలో జరగాలని నిందితులు కోరవచ్చని చెప్పారు. అయితే ఈ తీర్పును డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వం సవాల్ చేసింది. 


సీబీఐ విచారణపై హైకోర్టు ఎటువంటి స్టే ఇవ్వలేదు. కానీ సీబీఐ మాత్రం ఇంకా విచారణ ప్రారంభించలేదు. విచారణకు అనుమతి కోసం  తెలంగాణ ప్ర‌భుత్వానికి సీబీఐ లేఖ రాసింది. ఫామ్ హౌస్ కేసు సీబీఐకి బ‌దిలీ చేసిన క్ర‌మంలో ఎఫ్ ఐ ఆర్ న‌మోదుకు అన్ని అంశాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు ఆ లేఖ‌లో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం జనరల్ కన్సెంట్ ను రద్దు చేయడంతో.. విధిగా అనుమతి తీసుకోవాల్సి ఉంది. అయితే హైకోర్టు ఆదేశించినందున అనుమతి నిరాకరించడానికి వీల్లేదు అయితే  ఈ కేసుపై తెలంగాణ ప్ర‌భుత్వం హైకోర్టు డిజిజ‌న్ బెంచ్‌కు అప్పీల్‌కు వెళ్లింది కనుక తీర్పు వచ్చే వరకూ చూడాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ కారణంగా సీబీఐ విచారణ ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది.


సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కింద ఉన్న మోయినాబాద్ పోలీసులు ముగ్గురు నిందితులపై నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్(455/2022) ఆధారంగానే సిబిఐ ఎఫ్‌ఐఆర్ ఉండనుంది. నిందితులను మోయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారన్నది తెలిసిందే. భారత్ రాష్ట్ర సమితి  నలుగురు ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించడం, బిజెపికి అనుకూలంగా మారేందుకు వారిని ఆకర్షించడం వంటి పనులకు ఆ ముగ్గురు నిందితులు పాల్పడ్డారన్నది ఆరోపణ. రామచంద్ర భారతి, సింహయాజీ, నంద కుమార్ అనే ఆ ముగ్గురు నిందితులు మోయినాబాద్ ఫారమ్ హౌస్‌లో ఎంఎల్‌ఏలను ప్రలోభపెట్టే, బిజెపి పార్టీలోకి ఆకర్షించే మంతనాలు జరిపారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఏ పైలట్ రోహిత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. తనకు రూ. 100 కోట్లు, మిగతా ముగ్గురు ఎంఎల్‌ఏలకు ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు ఇచ్చేలా వారు ప్రలోభపెట్టారని రోహిత్ రెడ్డి   ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు.