మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపుల విధానం వల్ల అమ్మకాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ స్పెషల్ సెక్రెటరీ రజత్ భార్గవ తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు గా విజయవాడలో 11 షాపుల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని, రానున్న రెండు మూడు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.


ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాపంగా... 
మద్యం షాపుల్లో డిజిటల్‌ చెల్లింపుల విధానం  నుండి అమలులోకి వచ్చింది. తొలిసారిగా విజయవాడలో 11 షాపుల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ఎక్సైజ్ శాఖ స్పెషల్ సెక్రటరీ రజత్ భార్గవ ప్రారంభించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం షాపుల్లో కేవలం నగదు మాత్రమే అనుమతించడం వల్ల ఎదురవుతున్న అసౌకర్యం దృష్టిలో ఉంచుకుని డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చామన్నారు. విజయవాడలో 20 షాపుల్లో ఈ విధానాన్ని అమలులోకి తెస్తున్నామని ముందుగా 11 షాపుల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించినట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతి షాప్ కు ప్రత్యేక బ్యాంకు ఖాతా ప్రారంభించామన్నారు. చెల్లింపులపై, ఒక క్రెడిట్ కార్డ్ కు మినహా మిగతా వాటిపై ఎలాంటి రుసుము ఉండదని ఆయన స్పష్టం చేశారు.


ఈ విధానం వల్ల  నగదు,  డిజిటల్ చెల్లింపుల ద్వారా ఎంతమద్యం అమ్మకం జరిగింది, ఏ ఏ కంపెనీ బాటిల్స్ ఎన్ని అమ్మారని కూడా తెలుస్తుంది అన్నారు. ఎస్ బిఐ, బేవరేజ్ కార్పొరేషన్ తో కలిసి ఇందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చిందని ఆయన వివరించారు. ఫిబ్రవరి 5 నుండి రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సేవలను ప్రారంభించటంతో పాటుగా, రానున్న రెండు మూడు నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3780 మద్యం షాపుల్లో కూడా డిజిటల్ చెల్లింపులు ప్రారంభమవుతాయని ఆయన తెలియజేశారు. వివిధ మద్యం బ్రాండ్లపై పన్నుల శాతంలో వ్యత్యాసం ఉన్నందున నగదు సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన వివరించారు.


మందుబాబులకు ఈజీ... కరోనా పరిస్దితులు తరువాత డిజిటల్ చెల్లింపులు భారీగా పెరిగాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో మాత్రం ఇప్పటి వరకు డిజిటల్ సేవలు అందుబాటులోకి రాలేదు. దీని పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. మందుబాబులు కూడా తమ వద్ద నగదు లేని సమయంలో డిజిటల్ సేవలను అనుమతించాలని దుకాణంలోని సిబ్బంది పై అనేక సార్లు ఒత్తిడి తెచ్చేవారు. పలుమార్లు మద్యం దుకాణాల వద్ద ఈ విషయంలో గొడవలు జరిగాయి. అంతే కాదు డిజిటల్ చెల్లింపులను అనుమతించలేనే కొపంతో క్యాషియర్ పై దాడులకు పాల్పడిన ఘటనలు జరిగాయి. అదే కోపంతో గ్రామీణ ప్రాంతాల్లో అయితే రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్న సందర్బాలు కూడ వెలుగు చూశాయి.


అమ్మకాల్లో వ్యత్యాసాలు.. ఇది ఇలా ఉండగా మద్యం అమ్మకాలకు కేవలం నగదును మాత్రమే అనుమతించటం వలన అనేక సార్లు లెక్కల్లో తేడాలు వ్యత్యాసం వచ్చింది. ఇందులో దుకాణంలోని క్యాషియర్ లు చేతి వాటం ప్రదర్శించటం ,నగదు లావాదేవీల్లో వ్యత్యాసం రావటంతో సిబ్బందిని సస్పెండ్ చేస్తూ అధికారులు పలుమార్లు నిర్ణయం తీసుకున్నారు.ఈ క్రమంలో  తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన డిజిటల్ పేమెంట్స్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా అమలు చేస్తోంది. ఎట్టకేలకు ప్రభుత్వం డిజిటల్ సేవలను ప్రారంభించటంపై మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.