Palnadu Road Accident: ఫైనల్‌ డెస్టినేషన్... హాలీవుడ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఇష్టమైన సినిమా లిస్ట్‌లో ఇది కచ్చితంగా ఉంటుంది. రెగ్యులర్‌గా మనుషులు చేసే చిన్న చిన్న తప్పులు ఎంతటి ప్రమాదాలకు కారణమవుతాయో కళ్లకు కట్టినట్టు చెప్పే సిరీస్‌ ఆఫ్‌ సినిమాలు అవి. రోడ్డుపై వెళ్తున్నప్పుడు మీరు చేసే చిన్న తప్పు ఓ నిండు ప్రాణాన్ని తీసేయగలదు అంటే మీరు నమ్ముతారు. పల్నాడులో జరిగిన సంఘటన చూస్తే నిజమే అంటారు.

  


ఆగిన బస్సు.. పోయిన ప్రాణం


పల్నాడు జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ నిండు ప్రాణం పోయింది. చిలకలూరి పేట నియోజవర్గంలోని యడ్లపాడు వద్ద ఆగి ఉన్న బస్సును ఓ స్కూటీ ఢీ కొట్టింది. నక్క వాగు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.


వసంత నూనె మిల్లుకు చెందిన బస్సు.. కార్మికులను తీసుకువచ్చేందుకు యడ్లపాడు వైపు వెళ్తుంది. నక్క వాగు సమీపంలోకి రాగానే డ్రైవర్ బస్సును ఆపాడు. సుబాబుల తోట వద్ద హైవేపై బస్సు నిలుపుదల చేసి డ్రైవర్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలో అదే మార్గంలో గుంటూరుకు చెందిన తల్లి కూతుళ్లు.. నాగలక్ష్మి, సాయి లక్ష్మి స్కూటీపై వెళ్తున్నారు. చిలకలూరిపేట వైపు నుంచి యడ్లపాడు వైపు వెళ్తున్నారు. రోడ్డుపై ఆగి ఉన్న బస్సును వెనక నుంచి ఢీకొట్టారు. 


తప్పించబోయి.. బస్సు కిందకు దూసుకుపోయారు


నక్క వాగు వద్ద ఎవరో కొబ్బరికాయ కొట్టి దిష్టి తీసి రోడ్డుపైనే పడేశారు. అటుగా వచ్చిన సాయిలక్ష్మి దాన్ని సడెన్‌గా చూసింది. కొబ్బరి కాయపై నుంచి బండి పోనిస్తే అపచారమని భయపడింది. అందుకే కొబ్బరికాయను తొక్కకుండా బండిని తప్పించబోయింది. అంతే బండి స్కిడ్‌ అయ్యింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న బస్సును ఢీకొట్టింది. స్కూటీ వేగంగా ఉండటంతో బస్సు కిందకు దూసుకుపోయింది. స్కూటీ నడుపుతున్న సాయి లక్ష్మి తల బస్సు వెనక భాగానికి బలంగా తాకింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. తలకు హెల్మెట్ కూడా లేకపోవడంతో డైరెక్ట్ గా తల బస్సుకు తాకింది. సాయి లక్ష్మి  అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.


వెనక కూర్చున్న తల్లి లక్ష్మికి కూడా తీవ్రంగా గాయలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించి స్థానికులు వెంటనే 108 కి సమాచారం అందించారు. గాయపడ్డ మహిళను 108 వాహనంలో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 


ప్రమాదాలు ఎప్పుడు ఎటు నుంచి వస్తాయో ఊహించడం చాలా కష్టం. అందుకే ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తారు ప్రతి ఒక్కరూ. రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు బోలేడు ఉంటాయి. ఎవరు ఎటు నుంచి వచ్చి ప్రమాదం తలపెడతారో కలలో కూడా ఊహించలేం. మనం ఎంత అప్రమత్తంగా ఉన్నా, ఎదుటి వారి నిర్లక్ష్యం మన ప్రాణాలను బలి తీసుకుంటుంది.