Satyasai District Crime : సత్యసాయి జిల్లాలో దారుణం, అనుమానంతో భార్య, అత్తమామలపై అల్లుడు కత్తితో దాడి

ABP Desam   |  Satyaprasad Bandaru   |  29 May 2022 02:41 PM (IST)

Satyasai District Crime : సత్యసాయి జిల్లాలో దారుణం జరిగింది. భార్యపై అనుమానంతో ఓ వ్యక్తి భార్య, అత్తమామలపై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో భార్యకు తీవ్రగాయాలు అవ్వగా, అత్తామామలు స్వల్పంగా గాయపడ్డారు.

అత్తమామలపై కత్తితో దాడి

Satyasai District Crime : సత్యసాయి జిల్లా హిందూపురంలో దారుణం చోటుచేసుకుంది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి భార్యతో పాటు అత్తమామలపై కత్తితో దాడి చేశాడు. గాయపడ్డ బాధితులు హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

అసలేం జరిగింది? 

బోయ పేటకు చెందిన సుశీలమ్మ కొండప్పల కుమార్తె గౌతమికి మోడల్ కాలనీకి చెందిన శ్రవణ్ కుమార్ కు తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. భార్య గౌతమిపై అనుమానం పెంచుకుని నిత్యం వేధించేవాడు భర్త శ్రవణ్ కుమార్. 5 నెలల క్రితం పుట్టింటికి వచ్చిన గౌతమి అప్పటి నుంచి అమ్మ నాన్నల దగ్గర ఉంటుంది. శనివారం రాత్రి గౌతమి తల్లిదండ్రులు సుశీలమ్మ కొండప్ప మోడల్ కాలనీలో వారి బంధువుల ఇంటికి వెళ్లారు. ఇది గమనించిన శ్రావణ్ కుమార్, అతడి తమ్ముడు నవీన్ ఇద్దరు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో గౌతమికి బలమైన గాయాలు కాగా, అత్తమామలకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన ప్రైవేటు వాహనంలో హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

అల్లుడే దాడి

మా తమ్ముడికి కాలు విరిగిపోయిందని చూసి రావడానికి వెళ్లాం. తమ్ముడిని చూసి తిరిగి వచ్చేస్తున్నప్పుడు మా అల్లుడు శ్రవణ్ కుమార్, అతని తమ్ముడు నవీన్ కత్తులతో మా పై దాడి చేశారు. మా కుమార్తె గౌతమిపై కత్తులతో దాడి చేశాడు. మా పాప కొడుకు మమ్మీని చంపొద్దని ప్రాధేయపడిన వదలకుండా కత్తులతో దాడి చేశారు. మేము గట్టిగా కేకలు పెట్టినా ఎవరూ రాలేదు. మా బిడ్డపై దాడి చేస్తుంటే ఇంక చేసేది ఏంలేక వాళ్లపై తిరగబడి కత్తులు లాక్కొని చెట్లలోకి పాడేశాం. ఓ వ్యాను వచ్చేసరికి ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. చివరకు మా తమ్ముళ్లకు సమాచారం ఇస్తే వాళ్లు వచ్చి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మమ్మల్ని ఆసుపత్రికి పంపించారు. - సుశీలమ్మ, బాధితురాలు

వివాహేతర సంబంధం నిరాకరించిందని

హైదరాబాద్ నగరంలో మరో దారుణం జరిగింది. అసలే వరుస పరువు హత్యల ఘటనలతలో నగరవాసులు ఆందోళన చెందుతుండగా.. పట్టపగలే ఓ వివాహితపై ఓ వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడం కలకలం రేపుతోంది. కాంచన్‌బాగ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వివాహితపై మాజీ ప్రియుడు దాడి చేసినట్లు తెలుస్తోంది. హఫీజ్‌ బాబా నగర్‌లో ఓ రెస్టారెంట్‌ ముందు నిల్చొని ఉన్న మహిళపై కత్తితో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో పోలీసులు బాధితురాలిని ఒవైసీ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఆమె ప్రస్తుతం కోలుకుంటున్నారని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. బాధితురాలు, ముస్లిం మహిళ, నిందితుడు హబీబ్‌పై బాబానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆ మహిళ భర్త ఏడాది కిందట చనిపోయారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం హఫీజ్‌ బాబా నగర్‌లో ఓ రెస్టారెంట్‌ ముందు నిల్చుండగా.. హబీబ్ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వచ్చి మహిళపై దాడికి పాల్పడ్డాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావంతో మహిళ అక్కడికక్కడే కుప్పకూలిపోగా, నిందితుడు హబీబ్ అక్కడి నుంచి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.

 
Published at: 29 May 2022 02:36 PM (IST)
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.