IPL 2022, GT vs RR Final: ఐపీఎల్ 2022 గ్రాండ్ ఫినాలే వచ్చేసింది! ఆఖరి పోరులో గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) తలపడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో ట్రోఫీ కోసం కొట్టుకుంటున్నాయి. రెండు జట్లూ సరిసమాన బలాబలాలతో కనిపిస్తున్నాయి. మరి వీరిలో గెలిచేదెవరు? ఇంతకు ముందు ఏం జరిగింది? తుది జట్లలో ఎవరుంటారు?
2-0తో టైటాన్స్‌దే పైచేయి
ఈ సీజన్లో అస్సలు అంచనాల్లేకుండా బరిలోకి దిగింది గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)! హార్దిక్ పాండ్య (Hardik Pandya) కెప్టెన్సీపై అసలెవ్వరికీ నమ్మకం లేదు. టాప్ ఆర్డర్లో శుభ్‌మన్ గిల్ తప్పితే స్టార్లు, యువకుల్లేరు. పేపర్‌పైన చూస్తే అన్ని బేసెస్ కవర్ చేసినట్టే అనిపించలేదు. అండర్ డాగ్‌గా వచ్చిన ఆ జట్టు వరుస విజయాలతో ఫైనల్ చేరుకోవడం అద్భుతమే! మరోవైపు రాజస్థాన్ రాయల్స్ చక్కని జట్టును ఎంపిక చేసింది. వేలంలో విలువైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. 'ఫరెవర్ ఫస్ట్ రాయల్' షేన్ వార్న్‌కు ట్రోఫీతో నివాళి అర్పించాలని కంకణం కట్టుకుంది. ఫైనల్ చేరుకుంది. ఈ రెండు జట్లలో ఇప్పటికైతే 2-0తో హార్దిక్ సేనదే పైచేయి! లీగ్ మ్యాచులో హార్దిక్ 87, 1/18తో రెచ్చిపోయాడు. క్వాలిఫయర్ 1లో డేవిడ్ మిల్లర్ (David Miller) హ్యాట్రిక్ సిక్సర్లతో రెండో ఓటమి రుచిచూపించాడు.
సంజు కెప్టెన్సీలో రెండోసారే ఫైనల్‌కు
రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) ఫైనల్లో గెలవాలని పట్టుదలతో ఉంది. క్వాలిఫయర్ 1లో గుజరాత్ చేతిలో ఓడినా క్వాలిఫయర్ 2లో ఆర్సీబీని ఓడించిన తీరు ఆత్మవిశ్వాసం నింపుతుంది. జోస్ బట్లర్ (Jos Buttler) నుంచి రవిచంద్రన్ అశ్విన్ వరకు సిక్సర్లు, బౌండరీలు బాదగలరు. మధ్యలో సంజు శాంసన్ (Sanju Samson), హెట్‌మైయర్ కీలకంగా ఉంటారు. యశస్వీ, పడిక్కల్ విలువైన ఇన్నింగ్సులు ఆడారు. ట్రెంట్ బౌల్ట్ ఎప్పట్లాగే ప్రమాదకరంగా ఉన్నాడు. బంతికి కాస్త మూమెంట్ దొరికితే చెలరేగిపోతాడు. అశ్విన్, చాహల్ రూపంలో ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్ల జోడీ వీరికుంది. ప్రసిద్ధ్ ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. మెకాయ్ పేస్ వేరియేషన్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. జట్టంతా కలిసికట్టుగా ఆడితే విజయం అందుకోగలదు. ఎప్పట్లాగే అటాకింగ్ అప్రోచ్‌తో వెళ్తేనే మేలు! మొతేరా ఒకప్పుడు రాయల్స్‌కు హోమ్‌గ్రౌండ్ అన్న సంగతి మరవొద్దు.
ఎప్పట్లా ఆడితే చాలు!
క్వాలిఫయర్ 1 తర్వాత గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)కు ఎక్కువ సమయం దొరికింది. ఆటగాళ్లు విశ్రాంతి తీసుకొని రెజువనేట్ అయ్యారు. వారిపై అసలేమాత్రం ఒత్తిడి లేదు. ఎందుకంటే ఆశించిన దానికన్నా ఎక్కువే సాధించారు. హార్దిక్ పాండ్య తన అటాకింగ్ గేమ్ కాదని పరిస్థితులకు తగినట్టు పరిణతితో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్నాడు. అందరినీ కలుపుకొని పోతున్నాడు. ఓపెనింగ్‌లో సాహా దూకుడు, శుభ్‌మన్ గిల్ ప్రశాంతత, మాథ్యూవేడ్ అటాకింగ్ కలిసొస్తోంది. డేవిడ్ మిల్లర్ 'వింటేజ్ కిల్లర్'ను బయటకు తెస్తున్నాడు. రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్ మ్యాచు ఫినిషర్లుగా ఉంటున్నారు. బౌలింగ్‌లో రషీద్ గ్లోబల్ స్టార్ అన్న సంగతి తెలిసిందే. సాయి కిషోర్ రూపంలో అతడికి మరో స్పిన్ కెరటం తోడైంది. మహ్మద్ షమి, అల్జారీ జోసెఫ్, హార్దిక్ పేస్ సంగతి చూసుకుంటున్నారు. తమ సొంత అభిమానుల ముందు ఫైనల్ ఆడుతున్న టైటాన్స్ గెలిచినా ఆశ్చర్యం లేదు.
Gujarat Titans vs Rajasthan Royals Probable XI
రాజస్థాన్ రాయల్స్: యశస్వీ జైశ్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్, దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రన్ హెట్‌మైయిర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబెడ్ మెక్‌కాయ్
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, మాథ్యూవేడ్, హార్దిక్ పాండ్య, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్/ అల్జారీ జోసెఫ్, మహ్మద్ షమి