ASI Attacks Dhaba Server: రక్షకుడిగా ఉండాల్సిన పోలీస్ భక్షకుడిగా మారాడు. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత కలిగిన ఏఎస్ఐ కంట్రోల్ తప్పాడు. మద్యం మత్తులో అర్దరాత్రి వీరంగం చేశాడు. తనకు బిర్యానీ ఇవ్వలేదన్న కోపంతో హోటల్ సిబ్బందిపై బూతుల పర్వానికి దిగాడు. అంతటితో ఆగకుండా వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన సత్యసాయి జిల్లాలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.
ఆ వివరాలిలా ఉన్నాయి.. శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు ఉజైతుల్లా. బుధవారం అర్ధరాత్రి పీకలదాకా మద్యం సేవించాడు. తన దారిన తాను ఇంటికి వెళ్లకుండా.. యస్వీ డాబాకు వెళ్లాడు ఏఎస్ఐ ఉజైతుల్లా. మద్యం మత్తులో ఉన్న ఆయన తనకు బిర్యానీ కావాలని దాబా సిబ్బందిని అడిగాడు. సార్ అప్పటికే చాలా ఆలస్యమైందని, దాబా కూడా మూసేశామని బిర్యానీ లేదని బదులిచ్చారు పనివాళ్లు. నేను అడిగితే బిర్యానీ లేదంటావా అంటూ దాబాలో పనిచేస్తున్న సురేంద్ర నాయుడుని దుర్భాషలాడాడు ఏఎస్ఐ. అంతటితో ఆగకుండా దాడికి దిగి హంగామా చేశాడు ఆ పోలీస్.
10 బిర్యానీలు పార్సల్ అడిగి.. అంతలోనే !
అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించిన ఏఎస్ఐ ఉజైతుల్లా అర్ధరాత్రి సమయంలో మూసి ఉన్న ఎస్వీ దాబాకు వెళ్లాడు. నిద్రపోతున్న సురేంద్ర నాయుడును నిద్రలేపి లేపి 10 బిర్యానీలు పార్సల్ కావాలని అడిగాడు. అర్ధరాత్రి అయిందని, దాబా కూడా మూసేశామని.. బిర్యానీ లేదని సర్వర్ సురేంద్ర బదులిచ్చాడు. దాబా సిబ్బంది ఎంత నచ్చజెప్పినా వినిపించుకోని ఏఎస్ఐ.. నేను ఎవరనుకుంటున్నావు , నాకు భోజనం లేదని చెబుతావా నీకెంత ధైర్యం అంటూ మద్యం మత్తులో గొడవకు దిగి, ఆపై సురేంద్ర నాయుడపై దాడికి పాల్పడ్డాడు.
పోలీసులను ఆశ్రయించిన దాబా సిబ్బంది
తనకు న్యాయం చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆశ్రయించారు దాబా సిబ్బంది. ఏఎస్ఐ తనపై దూర్భాషలాడుతూ, దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా దాబా హోటల్ లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో అక్కడికి విచారించడానికి వెళ్లగా దాబా సిబ్బంది, పోలీసులకు వాగ్వివాదం జరిగిందని, ఈ క్రమంలో ఏఎస్ఐ సర్వర్ పై చేయి చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Sathya Sai District, AP News, ASI, Crime News, Nallamada Police, Satya Sai District