హైదరాబాద్ ఐఐటీలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఎంటెక్ విద్యార్థి కేసులో కీలక ఆధారం లభ్యమైంది. అందులో తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్న విషయాలు చనిపోకముందు యువకుడు రాసుకున్నాడు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ తరగతుల వల్ల తన ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతో పాటు, మరో మూడు కారణాలు తాను ప్రాణాలు తీసుకొనేందుకు కారణమని బింగుమల్ల రాహుల్‌ అనే 24 ఏళ్ల విద్యార్థిని తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఎంటెక్‌ చదువుతున్న ఏపీలోని నంద్యాలకు చెందిన రాహుల్‌ తన హాస్టల్ గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 31న ఉదయం 10 గంటల సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 


ఆ గదిని పరిశీలించిన పోలీసులకు లోపల ఒక పుస్తకంలో ‘ఇంపార్టెంట్‌ టెక్ట్స్‌ ప్లీజ్‌ సీమై ల్యాప్‌టాప్‌’ అని రాసి ఉన్నట్లు కనిపించింది. ల్యాప్ ట్యాప్ తెరిపించి అందులో ఉన్న సూసైడ్‌ లెటర్‌ ను పోలీసులు చదివారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్‌ మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆ లెటర్ ను చదివి వినిపించారు. 


‘‘నాకు బతకాలని లేదు. ప్లేస్‌మెంట్స్‌ ఒత్తిళ్లు, థీసిస్‌, ఫ్యూచర్ లో ఉద్యోగంలో సమస్యలు వస్తాయని అనిపిస్తుంది. రోజూ మానసిక ఒత్తిడి ఉంటోంది. చాలా మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్స్‌ కోసమే ఎంటెక్‌లో ప్రవేశిస్తారు. మరి థీసిస్‌ ఎందుకు? ట్రిపుల్‌ ఐటీ బెంగళూరులో థీసిస్‌కు బదులుగా ఇంటర్న్‌షిప్‌ను చేయిస్తున్నారు. థీసిస్‌ కోసం ఏ విద్యార్థినీ ఒత్తిడి చేయొద్దు ప్లీజ్. నా నిర్ణయానికి గైడ్‌ కారణం కాదు.. కేవలం భవిష్యత్తు మీద నాకున్న భయం మాత్రమే. ఒత్తిడిని తట్టుకునేందుకు ఆల్కహాల్, స్మోకింగ్ కి అలవాటుపడ్డా. ఒత్తిడిని తట్టుకోలేకపోయా. 


అమ్మా, నాన్నా నా అవయవాలను ఎవరికైనా దానం చేయండి. నాన్నా నువ్వు నీ జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావు. నాకు ఆశ్చర్యమేస్తోంది. నువ్వు ఇన్ని రోజులు నీ జీవితంలో సమస్యలతో ఎలా పోరాడావో.. ఈ చిన్నదాన్నే నేను భరించలేకుండా ఉన్నా. 2019లో జరిగిన మూడు సూసైడ్ ల నుంచి ఐఐటీ ఏమీ నేర్చుకోలేదు. విద్యార్థులకు స్టైఫండ్ టైమ్ లిమిట్ లోగా ఇవ్వాలి’’ అని బాధితుడు ల్యాప్‌టాప్‌లో రాసిన లేఖలో పేర్కొన్నారు. 


ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రం
ఇలాంటి ఒత్తిడికి గురైన సందర్భాల్లో ఐఐటీ హైదరాబాద్‌లో కౌన్సెలింగ్‌ కోసం ప్రత్యేక కేంద్రం ఉందని ఎస్పీ రమణ కుమార్‌ వివరించారు. అయినా దాన్ని రాహుల్‌ వాడుకోలేదని చెప్పారు. 


2019 నుంచి ఆరుగురు ఆత్మహత్య


అంతకుముందు కొద్ది రోజుల క్రితం సంగారెడ్డిలోని ఓ లాడ్జ్ పై నుంచి దూకి హైదరాబాద్ ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతను రాజస్థాన్ లోని జోధ్ పూర్ కు చెందిన మేఘా కపూర్ గా గుర్తించారు. మేఘా కపూర్ మూడు నెలల క్రితమే ఐఐటీ హైదరాబాద్ లో బీటెక్ లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాతి నుంచి సంగారెడ్డిలో ఉన్న ఆధ్యా లాడ్జిలో ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. 2019 నుంచి ఐఐటీ హైదరాబాద్ కు చెందిన ఆరుగురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.