Anantapur: దేశమంతా RRR సినిమా సంబరాలు జరుగుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో నందమూరి, కొణిదెల అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కానీ, అనంతపురం జిల్లాలో మాత్రం విషాదం చోటు చేసుకుంది. RRR సినిమా చూస్తూ గుండె పోటుతో ఓబులేసు (30) అనే అభిమాని మృతి చెందాడు. ఎస్‌వీ మాక్స్ థియేటర్‌లో RRR సినిమా చూస్తుండగా ఓబులేసు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం ఓబులేసును స్నేహితులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. 


తమ అభిమాన హీరో సినిమాలో కనిపించిన దృశ్యాలను చిత్రీకరిస్తూ ఓబులేసు కుప్పకూలిపోయినట్లు అతడి స్నేహితులు తెలిపారు. అయితే, ఓబులేసుకు గతంలోనే గుండె సమస్య వచ్చిందని, ఆ సమయంలో అతనికి స్టంట్ కూడా వేశారని స్నేహితులు తెలిపారు. అయితే, ఆ సమస్య ఉండగా.. RRR సినిమా చూస్తూ ఎమోషన్‌కు గురై గుండె పోటు వచ్చి ఉంటుందని స్నేహితులు, కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు.


ఓబులేసు అనంతపురం మున్సిఫాలిటిలో కాంట్రాక్ట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. మృతుడు ఓబులేసు చాలా మంచివాడని ఎన్నో సేవా కార్యాక్రమాలు చేశాడని స్నేహితులు రాఘవ తెలిపారు. మృతుడు ఓబులేసు ఎంతో మంది ప్రాణాపాయస్థితిలో ఉన్నవారికి రక్తం దానం చేసి ప్రాణాలు కాపాడాడని అన్నారు. ‘‘ఓబులేసుకు రెండు సంవత్సరాల క్రితమే గుండేపోటు రావడంతో స్టంట్ వేశారు. సినిమా థియేటర్‌లో సౌండ్ ఎక్కువగా ఉన్నందువల్లే ఈ రోజు మంచి స్నేహితుడు ఓబులేష్ ని కోల్పోయాం’’ అని ఓబులేసు స్నేహితుడు రాఘవ మీడియాతో చెప్పారు.


Chittoor: చిత్తూరు జిల్లాలో ముగ్గురు దుర్మరణం
మరోవైపు, చిత్తూరు జిల్లాలోనూ విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని వి.కోటకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు చనిపోయారు. వీరు నేడు RRR విడుదల సందర్భంగా థియేటర్‌ను అలంకరించి ఇంటికి వెళ్తున్నారు. వి కోటలోని థియేటర్ ముందు ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల సందర్భంగా భారీ కటౌట్లు కట్టి తిరిగి ఇంటికి బైక్‌పై వెళుతున్నారు. ఆ సమయంలో అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇదిలా ఉండగా.. సినిమా రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ తో కలిసి థియేటర్లో సినిమా చూశారు. హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి సినిమా చూడగా.. రామ్ చరణ్, రాజమౌళి భ్రమరాంబ థియేటర్‌లో సినిమా చూశారు. ఎన్టీఆర్ తన భార్య ప్రణతి, ఇద్దరు పిల్లలతో కలిసి సినిమా చూశారు. సినిమా చూసిన తరువాత ఎన్టీఆర్ బయటకు వస్తూ.. సినిమా అద్భుతంగా ఉందంటూ ఫ్యాన్స్ కి సంకేతాలు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.