తెలుగు రాష్ట్రాల్లో నేడు జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు అక్కడికక్కడే చనిపోయారు. వరంగల్ జిల్లాలో జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన బైకు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన లారీ - కారు ప్రమాదంలో ఇంకో ముగ్గురు యువకులు మృతి చెందారు.


వరంగల్ జిల్లాలో ఆటో ప్రమాదం
Warangal District Accident: వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొల్లికుంటలో వాగ్దేవి కాలేజ్ సమీపంలో ఓ వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులంతా వర్ధన్నపేటకు చెందిన కూరగాయలు అమ్మేవారిగా పోలీసులు గుర్తించారు.


వరంగల్‌లోనే మరో ప్రమాదం ఖమ్మం బైపాస్‌ హంటర్‌ రోడ్డు ఫ్లై ఓవర్‌పై జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఫ్లై పైనుంచి ఓ కారు కిందపడిపోయింది. దీంతో ఒకరు ఘటనా స్థలంలోనే మృతిచెందగా, మరొకరు ఆస్పత్రిలో మరణించారు. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి గాయపడ్డారు. అతడిని పోలీసులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతిచెందిన వారిని ఖమ్మం జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగి సారయ్య, ఆయన భార్య సుజాతగా గుర్తించారు.


కొత్తగూడెం జిల్లాలో బైక్ - బొగ్గు లారీ ఢీ
Kothagudem Road Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోనూ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బైక్‌ను బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన దాస్‌తండా సమీపంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు ఈ విషయాన్ని గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతులు ఎర్రాయిగూడేనికి చెందిన హనుమంతు, స్వామిగా పోలీసులు గుర్తించారు.


Medchal Accident: మేడ్చల్‌ జిల్లా సూరారం వద్ద మరో ప్రమాదం జరిగింది. కోళ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్‌ మరణించాడు. డీసీఎం అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంచనా వేశారు. దీనిపై కేసులు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


కడప జిల్లాలో లారీ - కారు ఢీ, ముగ్గురు దుర్మరణం
YSR Kadapa Road Accident: వైఎస్సార్‌ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. జిల్లాలోని మైలవరం మండలం కర్మలవారి పల్లె సమీపంలోని తాడిపత్రి బైపాస్‌ రోడ్డులో లారీ ఆగి ఉండగా కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. చనిపోయిన వారిని జమ్మలమడుగు మండలం మోరగుడి గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు చౌడం లక్ష్మీ మునమ్మ, వెంకటసుబ్బమ్మగా గుర్తించారు. ఈ ఘటనలో డ్రైవర్​తో పాటు ఓ బాలిక గాయపడింది. క్షతగాత్రులను జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.