జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తరాది రాష్ట్రాల పర్యటన జోరుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్‌ నేడు (మే 22)చండీగఢ్‌లో పర్యటన చేయనున్నారు. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతేడాది రైతు ఉద్యమంలో చనిపోయిన రైతు కుటుంబాలను కేసీఆర్ కలవనున్నారు. వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులతో కలిసి అమరులైన వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నారు. 


తొలుత ఆదివారం (మే 22) మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటికి వెళ్లనున్నారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత.. ఇద్దరు నేతలు కలిసి చండీగఢ్‌‌కు బయలుదేరనున్నారు. అక్కడ సుదీర్ఘ రైతు ఉద్యమంలో మరణించిన సుమారు 600 మంది రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్ కలుస్తారు. వారికి ఆర్థికసాయంగా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేయనున్నారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తెలంగాణ తరపున రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేస్తానని గతంలోనే తెలంగాణ సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఛండీగడ్‌లో ఈ కార్యక్రమం ముగిశాక కేసీఆర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీకి పయనం కానున్నారు.


బెంగళూరు పర్యటన 26న
దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న పర్యటనలో భాగంగా ఈ నెల 26న సీఎం కేసీఆర్‌ కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బెంగళూరులో మాజీ భారత ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని కలుస్తారు. అంతేకాక, మే 27న గుజరాత్‌లోని రాలేగావ్ సిద్ది టూర్‌కు కేసీఆర్ వెళ్లనున్నారు. అక్కడ ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కూడా కలుస్తారు. ఈ నెల 29 లేదా 30వ తేదీన పశ్చిమ్ బెంగాల్, బిహార్ రాష్ట్రాలకు కూడా కేసీఆర్ వెళ్లనున్నారు. అక్కడ గల్వాన్ లోయలో అమరులు అయిన భారత సైనిక కుటుంబాలను సీఎం పరామర్శిస్తారు.






ఢిల్లీలో స్కూళ్ల సందర్శన


కేజ్రీవాల్‌తో కలిసి ఢిల్లీలో సీఎం కేసీఆర్ శనివారం స్కూళ్లను సందర్శించారు. దక్షిణ మోతీబాగ్‌లో ఉన్న సర్వోదయ పాఠశాలను సందర్శించారు. ఆ తర్వాత పాఠశాలకు సంబంధించిన డాక్యుమెంటరీని కేజ్రీవాల్‌తో కలిసికేసీఆర్‌ చూశారు. విద్యార్థులను జాబ్‌ సీకర్లుగా కాకుండా జాబ్‌ ప్రొవైడర్లుగా మార్చుతున్న ఢిల్లీ విద్యావిధానం బాగుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందించారు. ఇంత పెద్ద జన సంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరమన్నారు. తెలంగాణలో కూడా ఈ విధానం అమలు చేస్తామని.. మా రాష్ట్రం నుంచి త్వరలో అధికారుల బృందాన్ని పంపించి సమన్వయం చేసుకుంటామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కేసీఆర్ తెలిపారు.


పాఠశాలలో ఉన్న వసతులు, ప్రత్యేకతలు, నిర్వహణ తీరును అధికారులు వివరించారు. పాఠశాలలోని మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి సీఎంలు ఇద్దరు గ్రూప్‌ ఫొటో దిగారు.ఆ తర్వాత సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వం పాఠశాలలను బాగా తీర్చిదిద్దిందని ప్రశంసించారు. కేజ్రీవాల్‌ తన సొంత విధానాలతో పాఠశాలలను అభివృద్ధి చేశారన్నారు.ఇంత పెద్ద జనసంఖ్య ఉన్న మన దేశానికి ఇది చాలా అవసరమన్నారు.