Road Accident: రోడ్డుపై వెళ్తున్నప్పుడు ప్రమాదం ఎటు నుంచి పొంచి ఉంటుందో చెప్పలేం. కనుక ఎల్లప్పుడూ ప్రయాణం సమయంలో అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం. కానీ కొన్నిసార్లు కళ్లు మూసి తెరిచే లోపే పెద్ద పెద్ద ప్రమాదాలు జరుగుతుంటాయి. నిజామాబాద్ జిల్లాలో అలాంటి ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 


టైరు పేలి కారు బోల్తా.. 
హైదరాబాద్ నుండి నిర్మల్ వైపు వెళ్తోంది ఓ కారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ బైపాస్ కొత్త పల్లి వద్దకు రాగానే.. కారు టైరు ఒక్కసారిగా పేలింది. అనుకోని ఘటనతో కారు అదుపు తప్పింది. కారు వేగంగా వెళ్తుండటం, అదే సమయంలో టైరు పేలడంతో కారు బోల్తా పడి, రెండు మూడు పల్టీలు కొట్టి రోడ్డు పక్కన ఉండే రెయిలింగ్ కు ఢీకొట్టి ఆగిపోయింది. ఈ దుర్ఘటనలో సంఘటనా స్థలంలోనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు చిన్నారులు ఉండటం అందరిని కలిచి వేస్తోంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది. వాహనం ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. హైదరాబాద్ నుంచి నిర్మల్‌కు కారులో మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. వారిలో నలుగురు పిల్లలు కాగా మరో ముగ్గురు పెద్ద వాళ్లు. టైరు పేలడంతో కారు పల్టీలు కొట్టి రెయిలింగ్ కు బలంగా ఢీకొట్టడంతో లోపల ఉన్న వారికి తీవ్రంగా గాయలయ్యాయి. 


మరో ముగ్గురికి తీవ్ర గాయాలు.. 
కారు ప్రమాదం ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లోనూ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వారిని హుటాహుటిన ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో చనిపోయినవారు, క్షతగాత్రులు అంతా హైదరాబాద్ లోని టోలిచౌకికి చెందిన వారిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ముప్కాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఆగి ఉన్న బస్సును ఓ స్కూటీ..


పల్నాడు జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ నిండు ప్రాణం పోయింది. చిలకలూరిపేట నియోజవర్గంలోని యడ్లపాడు వద్ద ఆగి ఉన్న బస్సును ఓ స్కూటీ ఢీ కొట్టింది. నక్క వాగు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడి రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మరొకరు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. వసంత నూనె మిల్లుకు చెందిన బస్సు.. కార్మికులను తీసుకువచ్చేందుకు యడ్లపాడు వైపు వెళ్తుంది. నక్క వాగు సమీపంలోకి రాగానే డ్రైవర్ బస్సును ఆపాడు. సుబాబుల తోట వద్ద హైవేపై బస్సు నిలుపుదల చేసి డ్రైవర్ కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లాడు. అదే సమయంలో అదే మార్గంలో గుంటూరుకు చెందిన తల్లి కూతుళ్లు.. నాగలక్ష్మి, సాయి లక్ష్మి స్కూటీపై వెళ్తున్నారు. చిలకలూరిపేట వైపు నుంచి యడ్లపాడు వైపు వెళ్తున్నారు. రోడ్డుపై ఆగి ఉన్న బస్సును వెనక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
Also Read: Bullet Bike Thieves: బుల్లెట్ బైకులంటే ప్రాణం, ఎక్కడ కనిపించినా అదే పనిచేస్తారు!