రానా దగ్గుబాటి (Rana Daggubati) సోషల్ మీడియాలో మరీ యాక్టివ్‌గా ఉండరు. ప్రతి రోజూ పోస్టులు చేయరు. కానీ, అప్పుడప్పుడూ ఆయన కనిపిస్తూనే ఉంటారు. స్నేహితులకు బర్త్ డే విషెస్ చెబుతారు. తన కొత్త సినిమా కబుర్లు ప్రేక్షకులతో పంచుకుంటారు. ఇంకా సరదాగా ఉంటారు. ఏమైందో? ఏమో? సోషల్ మీడియా నుంచి కొన్ని రోజులు సెలవు తీసుకోవాలని అనుకున్నారు. అంతే కాదు... ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు అన్నీ డిలీట్ చేశారు. 


ఐదు రోజుల క్రితం రానా దగ్గుబాటి ఒక ట్వీట్ చేశారు. అందులో ''వర్క్ ఇన్ ప్రోగ్రెస్! కొన్ని రోజులు సోషల్ మీడియా నుంచి విశ్రాంతి తీసుకుంటున్నాను. మిమ్మల్ని సినిమా హాళ్లలో కలుస్తాను. మరింత శక్తివంతంగా, మంచిగా, పెద్ద సినిమాలతో! మీ అందరికీ ప్రేమతో రానా దగ్గుబాటి'' అని ఆయన పేర్కొన్నారు. 


పెళ్లి రోజుకు ముందు...  
మిహీకా బజాజ్‌తో రానా వివాహమై ఆగస్టు 8కి రెండేళ్లు. పెళ్లి రోజుకు సరిగ్గా మూడు రోజుల ముందు రానా దగ్గుబాటి నుంచి సోషల్ మీడియాకు బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటన వచ్చింది.






ఇన్‌స్టాలో ఆల్ డిలీట్!
పెళ్లి రోజు తర్వాత రానా దగ్గుబాటి ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ చూసిన జనాలకు షాక్ తగిలింది. ఎందుకంటే... ఒక్కటంటే ఒక్క ఫోటో కూడా లేదు. అన్నీ డిలీట్ చేశారు. ఆయన ఇన్‌స్టా ఖాతాలో 4.7 మిలియన్ ఫాలోయర్లు ఉన్నారు. ఆయన 370 మందిని ఫాలో అవుతున్నారు. అయితే... ఎందుకు ఫోటోలు డిలీట్ చేశారు? ఏమైంది? అనేది మిస్టరీగా మారింది. రానా చెప్పే వరకూ ఆ విషయం ఎవరికీ తెలియదు. మరోవైపు రానా దగ్గుబాటి వైఫ్ మిహీకా బజాజ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారు. పెళ్లి రోజు రానాతో దిగిన పాత ఫోటోలను పోస్ట్ చేశారు.


'భీమ్లా నాయక్' అండ్ 'విరాట పర్వం'!
రానా దగ్గబాటి నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చాయి. అందులో '1945' సినిమా విడుదలైన విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. తాను ఆ సినిమా షూటింగ్ సగమే చేశానని, తనకు నిర్మాతలు డబ్బులు ఇవ్వలేదని రానా ట్వీట్ చేశారు. ప్రేక్షకులను చీట్ చేయడం కోసమే సినిమా విడుదల చేస్తున్నారని, ప్రేక్షకులు ఇటువంటి సినిమాలను ఎంట‌ర్‌టైన్‌ చేయవద్దని ఆయన కోరారు.


Also Read : ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!


'భీమ్లా నాయక్', 'విరాట పర్వం' సినిమాలు రానాకు మంచి పేరు తీసుకు వచ్చాయి. త్వరలో ఆయన 'రానా నాయుడు' వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అందులో బాబాయ్ వెంకటేష్‌తో కలిసి నటించారు.


Also Read : ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!