Kolkata Doctor Death Case Updates: కోల్‌కతా హత్యాచార నిందితుడు సంజయ్ రాయ్ గురించి ఇప్పటికే కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని మొబైల్‌లో బూతు వీడియోలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అంతే కాదు. తరచూ రెడ్‌లైట్ ఏరియాకి వెళ్లి వస్తుంటాడనీ విచారణలో తేలింది. హత్యాచారానికి పాల్పడే ముందు ఇద్దరి వేశ్యలతో గడిపాడు. ఆ తరవాత ట్రైనీ డాక్టర్‌పై ఇంత దారుణానికి ఒడిగట్టాడు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూస్తే నిందితుడు మృగంలా ప్రవర్తించాడని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే...పోలీసుల విచారణలో మరి కొన్ని కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.


హత్యాచారానికి పాల్పడిన తీరు ఆధారంగా సైకోఅనాలసిస్ టెస్ట్‌ చేయించారు. విచారణ అధికారులంతా కలిసి సంజయ్ రాయ్‌ని ఎన్నో ప్రశ్నలు అడిగారు. అదంతా ఎలా చేశావని అడగ్గా అసలు ఎక్కడా తడుముకోకుండా, పశ్చాత్తాపమే లేకుండా పూసగుచ్చినట్టు అంతా చెప్పాడు. తనకు ఈ ఘటనతో సంబంధమే లేదన్న ప్రశాంతంగా ప్రతి ఒక్క విషయాన్నీ చెప్పినట్టు సమాచారం. సంజయ్ రాయ్‌లో ఎక్కడా ఎలాంటి ఎమోషన్ కనిపించడం లేదని, తప్పు చేశానన్న భావనే అతనిలో లేదని గుర్తించారు. అంతే కాదు. అతని మాటల్ని బట్టి విని షాకైన CBI అధికారులు నిందితుడి బుర్రంతా కామంతో నిండిపోయిందని, అది తప్ప మరో ధ్యాసే లేదని ఓ నిర్ధరణకు వచ్చారు. 


పోస్ట్‌మార్టం రిపోర్ట్‌పై అనాలసిస్..


నిందితుడు ఇచ్చే స్టేట్‌మెంట్స్‌ని, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ని పోల్చి చూస్తున్నారు విచారణ అధికారులు. హత్యాచారం జరిగిన సమయంలో బాధితురాలు సంజయ్‌ రాయ్‌తో పెనుగులాడినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో నిందితుడి కుడి చేతికి గాయమైంది. ఆమె చేతి గోళ్లలో నిందితుడి చర్మం, రక్తాన్ని గుర్తించారు. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్టు 9వ తేదీన అర్ధరాత్రి డిన్నర్ చేసేందుకు వార్డ్ నుంచి బయటకు వచ్చింది. జూనియర్ డాక్టర్‌లతో కలిసి భోజనం చేసింది. ఆ తరవాత ఒంటిగంటకు సెమినార్‌ హాల్‌లోకి వెళ్లింది. 2.30 గంటలకు ఓ డాక్టర్‌తో మాట్లాడింది బాధితురాలు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చూస్తే సంజయ్ రాయ్‌ హాస్పిటల్‌లోకి తెల్లవారుజామున 4 గంటలకు వచ్చాడు. అక్కడి నుంచి నేరుగా మూడో అంతస్తుకి వెళ్లాడు. అక్కడే సెమినార్‌ హాల్‌లో బాధితురాలు విశ్రాంతి తీసుకుంటోంది. ఎవరూ లేని ఆ సమయంలోనే ఆమెపై దాడి చేసి అత్యాచారం చేశాడు. హత్య చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బట్టలు ఉతుక్కుని నింపాదిగా ఇంటికి వెళ్లిపోయినట్టు విచారణలో తేలింది. 


ఇక ఈ కేసులో CBI విచారణ కొనసాగుతోంది. అయితే..బాధితురాలి వివరాలు వెల్లడించిన సంజయ్ రాయ్ స్నేహితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పదేపదే ఫొటోలు, వ్యక్తిగత వివరాలు అప్‌లోడ్ చేయడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు. ఈ స్నేహితుల ఆన్‌లైన్ హిస్టరీనీ గమనిస్తున్నారు. ఇప్పటికే ఈ వివరాలన్నింటినీ సీబీఐ అధికారులకు అప్పగించారు. వైద్యుల డిమాండ్ మేరకు ప్రభుత్వం ఆర్‌జీ కార్ హాస్పిటల్‌లోని నలుగురు ఉన్నతాధికారులను బదిలీ చేసింది. 


Also Read: Kolkata: కోల్‌కతా కేసులో మరో సంచలనం, అనాథ శవాలు అమ్ముకున్న మాజీ ప్రిన్సిపల్ - బంగ్లాదేశ్‌తోనూ లింక్‌లు