Realter Kammari Krishna Murder Case: రంగారెడ్డి (Rangareddy) జిల్లా షాద్ నగర్ సమీపంలోని కమ్మదానమ్ వద్ద కేకే ఫామ్ హౌస్‌లో ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ (Kammari Krishna) హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నెల 10న జరిగిన హత్య సంచలనం సృష్టించగా.. పోలీసులు అన్ని కోణాల్లో విచారించి కేసును ఛేదించారు. కమ్మరి కృష్ణ మొదటి భార్య కుమారుడు కమ్మరి శివే అసలు నిందితుడని.. రూ.25 లక్షల సుపారీ ఇచ్చి ముగ్గురితో హత్య చేయించాడని నిర్థారించారు. ఆస్తి మొత్తం మూడో భార్యకు రాసిస్తున్నాడనే అక్కసుతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి 3 కత్తులు, 2 కార్లు, ఓ బైక్ స్వాధీనం చేసుకున్నామని శంషాబాద్ డీసీపీ రాజేశ్ తెలిపారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.


కక్షతోనే హత్య..


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్ నగర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కమ్మరి కృష్ణ (కేకే) వ్యాపారంలో రూ.వందల కోట్లు సంపాదించారు. అయితే, ఆయన మొదటి భార్య, ఆమె పిల్లలను పట్టించుకోకుండా రెండో వివాహం చేసుకోగా ఆమె మృతి చెందింది. ఈ క్రమంలోనే పావని అనే మహిళను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు 16 నెలల కుమార్తె ఉంది. ఆమె పేరిట దాదాపు రూ.16 కోట్ల విలువైన ఆస్తిని కేకే రిజిస్టేషన్ చేశారు. దీంతో మొదటి భార్య కుమారుడు ఆయనపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే తరచూ కుటుంబంలో గొడవలు జరిగేవి. ఆస్తి మొత్తం మూడో భార్యకే రాసిస్తాడనే ఉద్దేశంతో ఎలాగైనా కృష్ణను చంపాలని మొదటి భార్య కుమారుడు పథకం వేశాడు. కృష్ణ వద్ద పని చేసే బాబా శివానంద్ అలియాస్ బాబాకు రూ.25 లక్షలతో పాటు ఓ ఇల్లు ఇస్తానని ఆశ చూపాడు. ఇందుకు అంగీకరించిన బాబా శివానంద్ రూ.2 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నాడు. బాబా, జీలకర్ర గణేష్ అలియాస్ లడ్డు, మరో మైనర్ తో కలిసి కృష్ణను హత్య చేసేందుకు ప్రణాళిక వేశాడు.


గొంతు కోసి చంపేశారు


ఈ నెల 10న సాయంత్రం 5:30 గంటలకు కమ్మదానంలోని కేకే ఫామ్ హౌస్‌కు చేరుకుని కృష్ణను హతమార్చారు. గణేష్, మైనర్ ఇద్దరూ కలిసి కృష్ణ చేతులు వెనక్కి పట్టుకోగా.. బాబా కత్తితో కృష్ణ గొంతు కోసి, అనంతరం పొట్టలో పొడిచి పరారయ్యాడు. పారిపోతూ ఫాం హౌస్‌లో పని చేస్తున్న వాళ్లను డమ్మీ పిస్టల్‌తో బెదిరించారు. అతని అరుపులు విని పై అంతస్తులో ఉన్న భార్య ఆందోళనతో కిందకు వచ్చి చూడగా తీవ్ర గాయాలతో ఉన్న కృష్ణను శంషాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే కృష్ణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. హత్యపై మూడో భార్య పావని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి.. ఆధారాలు సేకరించి కన్న కుమారుడే అసలు నిందితుడని తేల్చారు. నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, కమ్మరి కృష్ణ మొదటి భార్యకు ఇద్దరు కుమారులున్నారు.


Also Read: Hyderabad News: నగరంలో తీవ్ర విషాదం - అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి యువతి ఆత్మహత్య