CM Chandrababu Assures Party Cadre : వైఎస్ఆర్‌సీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై నమోదైన తప్పుడు కేసులను ఎత్తివేయడానికి అవసరమైన చర్యలను చంద్రబాబు ప్రారంభించారు. తెలుదేశం పార్టీ ఆఫీసులో పార్టీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఐదేళ్ల కాలంలో కేసులను ఎదుర్కొని ఎంతో మంది పార్టీ కోసం పోరాటం చేశారని వారందరిపై వీలైనంత త్వరగా కేసులు ఎత్తివేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇందు కోసం ఏం చేయాలో పార్టీ నేతలకు సూచించారు. నియోజకవర్గాల వారీగా కార్యకర్తలపై నమోదైన కేసుల వివరాలను ప్రత్యేక ఫార్మాట్ లో వివరించి .. పార్టీ కార్యాలయానికి పంపించాలని సూచించారు. అలాగే వైసీపీ కార్యకర్తలు దాడులు చేసినప్పుడు .. సరిగా స్పందించని పోలీసులు, ఇతర అధికారుల సమాచారం కూడా పంపాలని అన్నారు, అందరిపై చట్ట ప్రకారమే చర్యలు తీసుకుందామని భరోసా ఇచ్చారు.
మంత్రులు రోజుకు ఇద్దరైనా పార్టీ ఆఫీసుకు రావాలన్న చంద్రబాబు
అధికారంలోకి వచ్చేశాం అనే ఆలసత్వం పార్టీ నేతలు వీడాలని.. మంత్రులు కూడా పార్టీ ఆఫీసుకు రావాలన్నారు. రోజూ ఒకరిద్దరు మంత్రులు అయినా పార్టీ కార్యలయానికి రావాలని సూచించారు. పార్టీ క్యాడర్ కు అందుబాటులో ఉండాలని.. వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు. మంత్రులు కార్యాలయాలకు వచ్చే బాధ్యతను ఇంచార్జులు తీసుకోవాలని సూచించారు. మంత్రులు పార్టీ ఆఫీసుకు వచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉండటం కూడా సేవేనని స్పష్టం చేశారు.
ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు ప్రత్యేక ఏర్పాటు
ప్రజల నుంచి వినతులు, విజ్ఞాపనలు స్వీకరణకు ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలనf ఇందుకోసం ఓ ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. పార్టీ నేతలు ఎవ్వరూ వ్యక్తిగత దాడులకు, కక్షసాధింపులకు దిగొద్దని వైసీపీ చేసిన తప్పులే మనం చేస్తే... వారికీ మనకూ తేడా ఉండదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారిని చట్టపరంగానే శిక్షిద్దామన్నారు.
పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చేందుకు కసరత్తు
పార్టీ కోసం కష్టపడే నాయకులకు పదవులు ఇచ్చే ఏర్పాట్లు చేశామని.. సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన నేతల సమాచారాన్ని పార్టీ ఆఫీసుకు ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. ఐదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించబోమని.. అందరికీ అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులతో, పార్లమెంట్ కోఆర్టినేటర్, నియోజకవర్గ పరిశీలకుడితో పాటు ఐవీఆర్ఎస్ ద్వారానూ సమాచార సేకరణ చేస్తున్నామన్నానరు. నివేదికలు త్వరగా పంపాలని ఆదేశించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. నారా లోకే,్ కూడా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటామని..సమస్యలను పరిష్కరించే వ్యవస్థను ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు దూరాభారం నుంచి రావొద్దని నారా లోకేష్ సూచించారు.