Assembly Bypolls Results 2024: బీజేపీ, ఇండీ కూటమికి మరోసారి హోరాహోరీ (Bypoll Results 2024) కనిపిస్తోంది. 7 రాష్ట్రాల్లోని 13 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఇవాళ (జులై 13) విడుదలవుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల ఫలితాల తరవాత వెలువడుతున్న ఫలితాలు కావడం వల్ల ఉత్కంఠ నెలకొంది. పైగా ఈ సారి బీజేపీకి తక్కువ సీట్‌లు వచ్చాయి. అటు ఇండీ కూటమి గట్టిగా పుంజుకుంది. కాంగ్రెస్‌ సొంతగా 99 సీట్లు గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఉప ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి పడింది. వెస్ట్‌బెంగాల్‌లో నాలుగు, హిమాచల్ ప్రదేశ్‌లో మూడు, ఉత్తరాఖండ్‌లో రెండు, బిహార్, పంజాబ్, మధ్యప్రదేశ్, తమిళనాడులో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గాలకు జులై 10వ తేదీన ఉప ఎన్నికలు జరిగాయి. ఈ అన్ని చోట్లా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం ట్రెండ్‌ని బట్టి చూస్తే మొత్తం 13 స్థానాల్లో 10 చోట్ల ఇండీ కూటమి బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే బెంగాల్‌లో మొత్తం నాలుగు చోట్ల ఎన్నికలు జరగ్గా ఈ అన్ని నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్‌ లీడ్‌లో దూసుకుపోతోంది. 






అటు హిమాచల్‌ ప్రదేశ్‌లోనూ ఈ ఉప ఎన్నికల ఫలితం అక్కడి సీనియర్ నేతల ఫేట్‌ని మార్చేయనుంది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ భవితవ్యం కూడా ఈ రిజల్ట్‌పైనే ఆధారపడి ఉంది. హిమాచల్‌లోని దెహ్రా నియోజకవర్గం నుంచి ఆయన సతీమణి కమలేశ్ ఠాకూర్ బరిలోకి దిగారు. అక్కడ ప్రస్తుత ట్రెండ్ ఆధారంగా చూస్తే బీజేపీ అభ్యర్థి కన్నా ముందంజలో ఉన్నారు ఠాకూర్. మిగతా రెండు చోట్లా కాంగ్రెస్ లీడ్‌లో ఉంది. ఉత్తరాఖండ్‌లోనూ బీజేపీకి షాక్ తగిలేలా కనిపిస్తోంది. అక్కడి మంగళూరు నియోజకవర్గంలో బీజేపీ వెనకబడింది. బీఎస్‌పీ కానీ కాంగ్రెస్ కానీ ఈ స్థానాన్ని కైవసం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంజాబ్‌లోని జలంధర్‌ నియోజకవర్గంలో గెలవడం ఆప్‌కి కీలకం. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆప్‌ అధికారంలో ఉంది. జలంధర్‌లో గెలవడం అనేది ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కి లిట్మస్ టెస్ట్‌గా మారింది. అందుకే ఆ పార్టీ ఈ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతానికైతే ఆప్‌ లీడ్‌లోనే ఉంది. బిహార్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యే మృతి చెందడం వల్ల ఉప ఎన్నికకు వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ RJDయే లీడింగ్‌లో ఉంది. తమిళనాడులో విక్రవంది నియోజకవర్గంలో డీఎమ్‌కేకి చెందిన అభ్యర్థి ముందంజలో ఉన్నారు.  


Also Read: Emergency Day: జూన్ 4వ తేదీని మోదీ ముక్తి దివస్‌గా ప్రకటించాలి, సంవిధాన్‌ హత్యా దివస్‌పై కాంగ్రెస్ సెటైర్లు