Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకంపై సోషల్‌మీడియా(Social Media)లో జరుగుతోంది తప్పుడు ప్రచారమని ఏపీ ప్రభుత్వం( AP GOVT) వివరణ ఇచ్చింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు విడుదల చేయలేదని...కేవలం గెజిట్ పబ్లికేషన్ (Gazette Notification)మాత్రమే ఇచ్చామని తెలిపింది. కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది.


తల్లికి వందనంపై తప్పుడు ప్రచారమే
కూటిమి పార్టీల ముఖ్య హామీల్లో ఒకటైన తల్లికి వందనం పథకానికి సంబంధించి రెండు, మూడురోజులుగా  సోషల్‌మీడియా(Social Media)లో విపరీతమైన ప్రచారం జరిగింది. ఒక కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే ప్రభుత్వసాయం అందించనుందని...అందుకు సంబంధించిన జీవో విడుదల చేసిందని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై తల్లిదండ్రులు కంగారుపడ్డారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu)..ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా చదువుకునే ప్రతిఒక్కరికీ తల్లికి వందనం సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇద్దరు, ముగ్గురు చిన్నారులు ఉన్న తల్లిదండ్రులు కొంత  ఆందోళనకు గురయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.


గెజిట్‌ పబ్లికేషన్ మాత్రమే విడుదల
ఒకటి నుంచి ఇంటర్‌ చదివే విద్యార్థుల తల్లులకు అందించనున్న తల్లికి వందనం పథకానికి ఆధార్‌(Aadhar)ను వినియోగించడానికి ముందుగా కేవలం గెజిట్ పబ్లికేషన్ మాత్రమే విడుదల చేసినట్లు పాఠశాల విద్యాశాఖ(School Education) తెలిపింది. ఈ పథకానికి సంబంధించి ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదని  విద్యాశాఖ కార్యదర్శి కోనశశిధర్‌ తెలిపారు. కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో మాత్రం అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. ప్రభుత్వశాఖల్లో పథకాలు అమలకు ఆధార్ వినియోగించినట్లయితే...ఆధార్ చట్టం ప్రకారం ముందుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుందని...అందుకే విడుదల చేశామన్నారు.


ఆధార్ వినియోగించుకోవాలంటే ముందుగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఉడాయ్‌ నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. లేకపోతే  ఆధార్ సేవలకు అంతరాయం కలుగుతుందన్నారు. త్వరలోనే తల్లికి వందనం పథకం అమల్లోకి రానున్న నేపథ్యంలో ముందుగానే ఆధార్ వినియోగించడానికి ఉన్న అనుమతులన్నీ తీసుకోవడం జరుగుతోందన్నారు. కానీ కొందరు ఇవన్నీ అర్థం చేసుకోకుండా ఇష్టానుసారం ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం మండిపడింది. అసత్య ప్రచారాలతో తల్లిదండ్రుల్లో ఆందోళన కల్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీపైనా వెనక్కి తగ్గేది లేదని...ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక కష్టాలు ఉన్నా...కచ్చితంగా సూపర్‌సిక్స్ (Super 6)పథకాలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఇప్పటికే విద్యాసంవత్సరం ప్రారంభంకావడంతో  వీలైనంత త్వరగా మార్గదర్శకాలు విడుదల చేసి తల్లికి వందనం పథకాన్ని అమల్లోకి తెస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే  పింఛన్ పెంపు, ఉచిత ఇసుక పంపిణీ సహా  నైపుణ్య గణన, మెగా డీఎస్సీ హామీలను నెరవేర్చించింది. మరో మూడు కీలక హామీలను ఆగస్టు 15 నుంచి అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. అన్నక్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పథకాలు త్వరలో అమలు కానున్నాయి. ఇదే కోవలో తల్లివందనం పథకాన్ని సైతం వీలైనంత త్వరగా అమలు చేయనున్నట్లు  ఏపీ ప్రభుత్వం తెలిపింది.