Young Woman Suicide In Miayapur: నగరంలో శనివారం తీవ్ర విషాదం జరిగింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ (Miyapur Police Station) పరిధిలో ఓ యువతి అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానిక జనప్రియ అపార్ట్‌మెంట్ భవనం పైనుంచి శృతి (25) అనే యువతి దూకింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను మియాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. డిప్రెషన్ కారణంగా యువతి బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఘటనలు
అటు, నిజామాబాద్ జిల్లాలోని ఓ హోంగార్డు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎల్లమ్మగుట్టకు చెందిన సంపత్ (43) హోంగార్డుగా పని చేస్తున్నాడు. రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హోంగార్డు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అలాగే, ఇందల్వాయి రైల్వే స్టేషన్ వద్ద రెండు మృతదేహాలు కలకలం రేపాయి. రైల్వే ట్రాక్ పక్కన డ్రైనేజీలో ఈ మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటారని భావిస్తున్నారు.
రోడ్డు ప్రమాదాలు
మరోవైపు, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం టీజీ పల్లి వద్ద శనివారం రోడ్డు ప్రమాదం సంభవించింది. చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ఓ బాలుడు మృతి చెందగా.. కారు డ్రైవింగ్ చేస్తోన్న యువకుడు సహా మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటు, వరంగల్ మామునూరులో జ్యోతిబాపూలే పాఠశాల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ హోంగార్డు ప్రాణాలు కోల్పోయాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొని హోంగార్డు సుదాకర్ మృతి చెందారు. పీఎస్‌లో విధులకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Crime News: 'భారతీయుడు - 2' సినిమా చూస్తుండగా కత్తితో పొడిచేశాడు - భయంతో ప్రేక్షకుల పరుగులు