Private Employee Surendar Kidnap Case: నగరంలో ప్రైవేట్ ఉద్యోగి సురేందర్ కిడ్నాప్ కేసు సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన రాయదుర్గం (Rayadurgam) పోలీసులు సురేందర్ సోదరి నిఖితనే నిందితురాలిగా తేల్చారు. తెలుగు రాష్ట్రాల్లోనే కరడుగట్టిన కిడ్నాప్ ముఠాతో కలిసి స్కెచ్ వేసి ఈ తతంగం నడిపినట్లు చెప్పారు. బాధితుడి సోదరి నిఖితతో సహా, ఆమె ప్రియుడు బల్లిపార వెంకటకృష్ణ సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. మరో ఇద్దరి పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నారు. రాయదుర్గం, గచ్చిబౌలి పోలీస్ ఇన్ స్పెక్టర్లు మహేశ్, జేమ్స్ బాబు, మాదాపూర్ ఏసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ నరసింహారెడ్డితో కలిసి డీసీపీ శ్రీనివాసరావు ఆదివారం కేసు పూర్తి వివరాలను వెల్లడించారు.
కథ - స్క్రీన్ ప్లే - డైరెక్షన్
తన ప్రియుడితో కలిసి సంతోషంగా జీవించేందుకు డబ్బు అవసరమని భావించిన ఆ చెల్లెలు అన్ననే కిడ్నాప్ చేయించింది. కరడు గట్టిన కిడ్నాప్ ముఠాతో చేతులు కలిపి రూ.2 కోట్లు డిమాండ్ చేయించింది. నల్లగొండ పట్టణానికి చెందిన గుర్రం సురేందర్, భార్య నాగమణితో కలిసి నగరంలోని ఓ ప్లాట్స్ లో ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన చిన్నాన్న కూతురు మాచర్లకు చెందిన గుర్రం నిఖిత గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పని చేస్తోంది. అక్కడే పని చేస్తున్న కృష్ణా జిల్లాకు చెందిన వెంకటకృష్ణతో ఆమెకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇతనిపై ఇంతకు ముందే కేసులుండగా.. జైలులో కరడుగట్టిన కిడ్నాపర్ అత్తాపూర్ కు చెందిన సురేశ్ అలియాస్ సూర్య (31)తో పరిచయం ఏర్పడింది. డబ్బులు అవసరమని ఏదైనా ఉంటే చెప్పాలని సురేశ్ డిసెంబరులో వెంకటకృష్ణను సంప్రదించగా.. పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడాలనే ఆలోచన ఉన్న నిఖిత, వెంకటకృష్ణ డబ్బున్న వ్యక్తిని కిడ్నాప్ చేయించాలనే ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలో తన అన్న సురేందర్ ను కిడ్నాప్ చేయాలని నిఖిత సలహా ఇచ్చింది. ఆయన భార్య ఐటీ ఉద్యోగిని అని చెప్పింది. పథకం ప్రకారం అన్నకు సంబంధించిన అన్ని వివరాలను వారికి చెప్పింది. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ తో ఈ నెల 4న తనను కొంత మంది వేధిస్తున్నారని మాట్లాడాలని.. అన్న సురేందర్ ను నిఖిత పిలిచింది. సురేందర్ అక్కడికి వెళ్లి చెల్లెలితో మాట్లాడుతుండగా ఐదుగురు ఆగంతుకులు బలవంతంగా అక్కడికి వచ్చి అతన్ని కారులో ఎక్కించుకుని వెళ్లారు. ఇది గమనించిన అక్కడున్న ఇద్దరు 100కు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకోగానే నిఖిత తన అన్నను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పింది. పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు కూడా చేసింది.
రూ.2 కోట్లు డిమాండ్
సురేంద్రను తీసుకెళ్లిన నిందితులు ఆయన భార్యకు ఫోన్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. నిందితులు కడ్తాల్ చేరుకున్నాక వారి కారు బ్రేక్ డౌన్ అయ్యింది. దీంతో వారు సురేంద్రతో అతని భార్యకు వాయిస్ మెసేజ్ ద్వారా ఇంకో కారు పంపించాలని చెప్పారు. పథకం ప్రకారం వెంకటకృష్ణ, నిఖిత ఇద్దరూ కారును కడ్తాల్ తీసుకెళ్లి కిడ్నాపర్లకు అప్పగించారు. అనంతరం ఇద్దరూ కోళ్లు తరలించే వాహనంలో అర్ధరాత్రి హైదరాబాద్ తిరిగొచ్చారు. కాగా, సెల్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ ప్రాంతంలో చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది కారును అడ్డుకున్నారు. నిందితులు తప్పించుకునేందుకు యత్నించగా వెనుక వాహనాలను ఢీకొట్టారు. ముగ్గురు నిందితులు పారిపోగా, కిడ్నాపర్లలో ఒకడైన రోహిత్, బాధితుడు సురేందర్ దొరికారు. సురేందర్ చెప్పిన వివరాలు, సాంకేతిక ఆధారాలతో పోలీసులు నిందితులు సురేశ్, వెంకటకృష్ణ, రాజు, నిఖితను అదుపులోకి తీసుకున్నారు. వారిని రిమాండుకు తరలించినట్లు చెప్పారు.