Rangareddy News : రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన  చోటుచేసుకుంది. ఈత సరదా నలుగురు చిన్నారుల ప్రాణాలు తీసింది.  జిల్లాలోని యాచారం మండలం గొల్లగూడ గ్రామంలో ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. గొల్లగూడ గ్రామానికి చెందిన బబ్బు(11), కాలేద్(10) , ఇమ్రాన్ (11), రెహాన్(10) తల్లిదండ్రులతో ఊరికి దగ్గర్లోని ఓ దర్గాకి వెళ్లారు. దర్గా నుంచి తిరిగి వస్తుండగా తల్లిదండ్రుల కన్నా ముందు గ్రామానికి సమీపంలో ఉన్న  ఎర్రకుంట చెరువు వద్దకు చేరుకున్నారు. సరదాగా ఈత కొట్టేందుకు నలుగురు చెరువులో దిగారు. చెరువు లోతు ఎక్కువగా ఉండడంతో నలుగురు విద్యార్థులు ఆ గుంతల్లో మునిగిపోయారు. నలుగురు చిన్నారులు గుంతల్లోకి వెళ్లడం చూసిన పశువుల కాపరులు ఎంతసేపటికి వాళ్లు తిరిగి బయటికి రాకపోవడంతో చెరువులో దూకి చిన్నారులను బయటికి తీశారు. అప్పటికే నలుగురు చిన్నారులు మృతి చెందినట్లు గుర్తించారు. నలుగురు చిన్నారులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.  అప్పటి వరకు తమతో ఉన్న పిల్లలు మృతి చెందడంతో కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. ఈ ఘటనపై స్థానిక సీఐ లింగయ్య  సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. 


చెరువులో ట్రాక్టర్ బోల్తా 


ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వెళ్తున్న ఓ ట్రాక్టర్​అదుపుతప్పి చెరువులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మొత్తం 26 మంది వరకు మృతి చెందారు. మరో 10 మందికి గాయపడ్డారు, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాన్పుర్​లోని ఘతంపుర్​ ప్రాంతంలో శనివారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. కాన్పుర్​లోని ఘతంపుర్ ప్రాంతానికి చెందిన భక్తులు సమీపంలోని ఓ గుడికి శనివారం సాయంత్రం వెళ్లారు. పూజలు ముగించుకుని రాత్రి సమయంలో గుడి నుంచి ట్రాక్టర్ లో తిరిగి వస్తుండగా.. అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. తొలుత ఈ ప్రమాదంలో దాదాపు ఆరుగురు వ్యక్తులు చనిపోయారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని స్థానికుల సహాయంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ లో దాదాపు 50 మంది వరకు ప్రయాణిస్తున్నారని జిల్లా మేజిస్ట్రేట్ విశాంక్ జి అయ్యర్ తెలిపారు.


భారీగా పెరిగిన మృతుల సంఖ్య


రాత్రివేళ కావడం, అందులోనూ ట్రాక్టర్ లో ప్రయాణిస్తున్న వారిలో అధికంగా మహిళలు, చిన్నారులు ఉన్నారు. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య భారీగా పెరిగిందని జిల్లా మేజిస్ట్రేట్ విశాంక్ జి అయ్యర్ తెలిపారు. మొదట 6 మంది చనిపోయినట్లు గుర్తించగా, రెస్క్యూ ఆపరేషన్ పూర్తయ్యేసరికి మృతుల సంఖ్య 26కు పెరిగినట్లు పోలీసులు వెల్లడించారు. సమీపంలోని చంద్రికాదేవి ఆలయంలో నిర్వహించిన మండన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన భక్తులు ట్రాక్టర్ లో తిరిగి వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాద స్థంలోనే 12కు పైగా భక్తులు చనిపోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరికొందరు తుదిశ్వాస విడిచారని అయ్యార్ వివరించారు. 


Also Read : Hyderabad News : దసరాకు సొంతూరు వెళ్తున్నారా? అయితే పోలీసుల సూచనలు మీకోసమే!


Also Read : 28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు- నిత్యపెళ్లి కొడుకును పట్టించిన యువతి!