అతడి వయసు 28 ఏళ్లు. ఈ వయసు వాళ్లంతా అప్పుడప్పుడే పెళ్లి చేస్కుంటుంటారు. అతడు కూడా అందరి లాగే పెళ్లి చేసుకున్నాడు. ఒకటో రెండో కాదండీ.. ఏకంగా 24 మందిని మనువాడాడు. రోజుకో పేరుతో నకలీ ధ్రువ పత్రాలు సృష్టించడం, పెళ్లిళ్లు చేస్కోవడం, పత్తా లేకుండా పారిపోవడం.. ఇలా సాగిస్తూ వచ్చాడు. చివరకు ఆఖరుగా చేసుకున్న అమ్మాయికి దొరకిపోయి ఊచలు లెక్కబెడుతున్నాడు. అయితే ఈ ఘటన ఎక్కడ, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 


అసలేం జరిగిందంటే..?


బంగాల్ లోని సాగర్ దిగీ ప్రాంతానికి చెందిన ఓ మహిళను అసబుల్ మొల్లా అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు పెళ్లి జరిగిన కొంత కాలం వీరి కాపురం బాగానే సాగింది. ఆ తర్వాత ఒతడు ఒక్కసారిగా మాయమైపోయాడు. అలాగే ఇంట్లోనే ఉన్న ఆమె నగలు కూడా కనిపించకుండా పోయాయి. దీంతో అనుమానం వచ్చిన ఆమె.. భర్త మోసం చేశాడని సాగర్ దిగీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఇలాఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 


నకిలీ గుర్తింపు కార్డులను అవలీలగా సృష్టించి బిహీర్, పశ్చిమ బంగాల్ లోని పలు ప్రాంతాల్లో అసబుల్ తిరిగేవాడు. ఒక చోట అనాథ అని, మరో చోట జేసీబీ డ్రైవర్ అని, ఇంకో చోట కూలీ ఇలా పేర్లు మార్చుకుంటూ తిరిగేవాడు. అలా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నాళ్లకు ఇంట్లోని నగలు, డబ్బులు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యే వాడు. ఇలా 23 మందిని మోసం చేసి సాగర్ దిగీలోని  ఓ మహిళను 24వ పెళ్లి చేసుకున్నాడు. ఎప్పటిలాగే తన చేతి వాటం చూపించి అక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఈసారి మనువాడిని అమ్మాయి అతనిపై ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు అసబుల్ ను పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అతడి బాగోతం బయట పడింది. ఇంకా పూర్తిగా విచారణ జరిపుతామని చెబుతున్నారు. 


నంద్యాలలో నిత్య పెళ్లి కూతురు.. 


నంద్యాల జిల్లా మిట్నాల గ్రామానికి చెందిన 24 ఏళ్ల యువతి ఒకరికి తెలియకుండా మరొకర్ని ఇలా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఆమె విడాకులు ఇవ్వకుండా ముగ్గుర్ని మోసం చేసినట్లు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించడంతో మహిళ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై శ్రీనివాసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం మిట్నాలకు చెందిన మేరీ జసింట అలియాస్‌ మేరమ్మ కుమార్తె శిరీషకు గతంలో అవుకు మండలం చెన్నంపల్లె గ్రామానికి చెందిన మల్లికార్జునతో తొలి వివాహం జరిగింది. మల్లికార్జునతో విడాకులు తీసుకోకుండానే ఆత్మకూరు మండలం కొత్తపల్లెకి చెందిన శ్రీనివాసరెడ్డిని శిరీష రెండో పెళ్లి చేసుకుంది. అతడితో కూడా విడాకులు తీసుకోకుండానే బేతంచెర్ల మండలం ఆర్‌ఎస్‌ రంగాపురం వాసి మహేశ్వరరెడ్డిని మూడో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. మహేశ్వరరెడ్డికి కూడా రెండో పెళ్లి కావడంతో ఆయన పెళ్లికి ఒప్పుకున్నాడు. అయితే శిరీష్ తనకు రక్షణగా రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయాలని కోరింది. రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయగా, ఫిబ్రవరి 5న మద్దిలేటిస్వామి ఆలయంలో పెళ్లి అయింది. 


నాలుగో పెళ్లికి సిద్ధం! 


శిరీష తల్లి మేరమ్మ ఆర్‌ఎస్‌ రంగాపురం తరచూ వస్తూ తన కూతురిని అత్తారింట్లో ఉంచాలంటే మరికొంత డబ్బు, ఆస్తి రాసివ్వాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. శిరీష్, ఆమె తల్లి ప్రవర్తనపై అనుమానం వచ్చిన మహేశ్వరరెడ్డి శిరీష గురించి విచారించారు. దీంతో ఆమెకు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగినట్లు తెలుసుకొని షాకయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. అయితే ముగ్గురిని మోసం చేసిన శిరీష తాజాగా నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం.