Double Murder in Rangareddy District: మైలార్‌దేవ్‌పల్లి: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాలు ఇద్దరి ప్రాణాల్ని బలి తీసుకున్నాయి. మైలార్‌దేవ్‌పల్లి పరిధి బాబుల్‌రెడ్డి నగర్‌లో శనివారం సాయంత్రం జరిగిన జంట హత్యలు కలకలం రేపాయి. మద్యానికి బానిసై నిత్యం గొడవ పడుతున్న తండ్రిని, గొడవ అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంధువుని ఓ యువకుడు హత్య చేశాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి పరిధి బాబుల్‌రెడ్డి నగర్‌లో లక్ష్మీనారాయణ కుటుంబం నివాసం ఉంటోంది. అతడు మద్యానికి బానిసయ్యాడు. చాలా ఏళ్ల నుంచి మద్యం సేవించి తరచుగా భార్యతో గొడవ పడేవాడు. పిల్లలను సైతం వేధించేవాడు. ఈ మధ్య వేధింపులు అధికమయ్యాయి. ఈ క్రమంలో కొన్ని రోజుల కిందట వారి ఇంటిని అమ్మాలని నిర్ణయానికి వచ్చారు. అయితే ఇల్లు అమ్మితే వచ్చే మొత్తంలో రూ.20 లక్షల వరకు తనకు ఇవ్వాలని భార్యతో లక్ష్మీనారాయణ శనివారం సాయంత్రం గొడవకు దిగాడు. కుటుంబసభ్యులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు.
అసలే మద్యం సేవించి నిత్యం గొడవకు దిగే అలవాటున్న లక్ష్మీనారాయణ(55).. భార్య తనకు అడిగినంత వాటా డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించడంతో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా భార్యపై దాడికి పాల్పడ్డాడు. మొదట కుమారుడు తండ్రికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. అతడిపై సైతం లక్ష్మీనారాయణ దాడికి పాల్పడ్డాడు. డబ్బుల కోసం అమ్మను కొడతావా, గొడవ వద్దంటే నాపై దాడి చేస్తావా అంటూ కుమారుడు ఆగ్రహావేశానికి లోనయ్యాడు. ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి తండ్రిపై పదునైన ఆయుధంతో దాడి చేశాడు. అడ్డుకునేందుకు సమీప బంధువు (మేనమామ శ్రీనివాస్ (60)) ప్రయత్నించగా అతడిపై సైతం ఆయుధంతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు ఆ యువకుడు. ఆ ఏరియా వాళ్లు అడ్డుకుని వారించే ప్రయత్నం చేసినా, వారి నుంచి విడిపించుకుని వెళ్లి మరీ ఇద్దర్నీ నరికి హత్య చేశాడు. అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరగడంతో ఈ జంటల హత్యలు స్థానికంగా కలకలం రేపాయి. తండ్రి తాగొచ్చి నిత్యం వేధించేవాడని లక్ష్మీనారాయణ కుమార్తె పోలీసులకు తెలిపింది. నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు యువత జీవితాన్ని నాశనం చేస్తాయని, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని పోలీసులు సూచించారు.