Ramagundam News : రామగుండం ఎరువుల కర్మాగారంలో ఉద్యోగాలు వస్తాయని లక్షల్లో డబ్బు కట్టి మోసపోయిన నిరుద్యోగులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని తిలక్ నగర్ కు చెందిన అపరాధి శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొద్ది రోజుల కిందట గంగాధర మండలం పెద్ద తోటపల్లికి చెందిన తూము నర్సయ్యతో పాటు మరికొందరికి ఎరువుల కర్మాగారంలో ఉద్యోగం కోసం రూ.8 లక్షల ఇరవై వేలు ఇచ్చాడు శ్రీనివాస్. ఆ తర్వాత ఉద్యోగం రాకపోగా ఇచ్చిన డబ్బులు తిరిగి రాలేదు. డబ్బులు అడిగితే బెదిరింపులకు గురిచేయడంతో ఆవేదనకు గురయ్యాడు శ్రీనివాస్. ఈ ఘటనపై శ్రీనివాస్ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ ప్రయోజనం లేదు. దీంతో తనకు న్యాయం జరగలేదని అవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తూము నర్సయ్య మరికొందరు అన్యాయం చేశారని, తన ఆత్మహత్యకు కారణం వారేనని సూసైడ్ నోట్ రాశాడు. అలాగే ఆ డబ్బులను తన కుటుంబ సభ్యులకు ఇప్పించాలని సూసైడ్ నోట్ లో రాశాడు. శ్రీనివాస్ ను కుటుంబ సభ్యులు గోదావరిఖని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి వైద్యులు హైదరాబాద్ ఆసుపత్రికి పంపించారు.


పర్మినెంట్ ఉద్యోగాల పేరిట మోసం 


కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆర్ఎఫ్సీఎల్ తిరిగి ప్రారంభం కావడంతో పలువురు నిరుద్యోగుల్లో అందులో ఉద్యోగాలపై ఆశ పెరిగింది. దీని కోసం కొందరు దళారులు స్థానిక నేతల అండదండలతో 8 నుండి 12 లక్షల వరకు వసూలు చేశారని అని ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంపైగా 25 వేల జీతంతో పాటు క్వార్టర్స్ ఇతర అన్ని సౌకర్యాలు లభిస్తాయి అంటూ చెప్పడంతో తాము భారీ మొత్తంలో నగదు సమర్పించుకున్నామని బాధితులు వాపోయారు. ఇదంతా కూడా ఒక సంవత్సరం పాటు పనిచేసిన తర్వాత కొందరు కాంట్రాక్టు కార్మికులను యజమాన్యం తొలగించడంతో బయటపడింది. ఇక బాధితులంతా ఒక గ్రూపుగా ఏర్పడి నిరసనలు ధర్నాలకు సైతం దిగారు. ఇక అప్పటి నుండి మొదలైన ఆరోపణల పర్వం అధికార టీఆర్ఎస్ నాయకులపై మాటల దాడికి ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ నాయకులకు అవకాశం ఇచ్చినట్లయింది. అవసరమైతే గవర్నర్ ని సైతం కలిసి దీనిపై కేంద్ర స్థాయి సంస్థలతో విచారణ చేయాలంటూ కోరతామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.


ఎమ్మెల్యేపై ఆరోపణలు 


రామగుండం ఉద్యోగాల వివాదంలో ఎమ్మెల్యే కోరుకొండ చందర్ అనుచరులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఇటీవల సీపీఐ(మావోయిస్టు) లేఖ వైరల్ అయింది. స్వయానా సింగరేణికి చెందిన  ఎమ్మెల్యే చందర్ రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ఉద్యోగాల విషయంలో తన అనుచరులను ముందుంచి దాదాపుగా రూ.45 కోట్లకు పైగా వసూలు చేశారని లేఖలో ఆరోపించారు. ఇందులో అతని వెంట తిరిగే బొమ్మ గాని తిరుపతి గౌడ్, మోహన్ గౌడ్ , కుంటి రాజు , పెంట రాజేష్, సిలివేరు రవిచందర్, బంటి, రవి, అజయ్ ,అంబటి నరేష్ ,జగదీష్ వంశీలతో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు కుమ్మక్కు అయి 790 మంది దగ్గర దాదాపుగా రూ.4 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు డబ్బులు వసూలు చేశారని లేఖలో తెలిపారు. 


Also Read : Nizamabad News: రెండో విడత దళిత బందుపై నిజామాబాద్‌లో ఒకటే లొల్లి


Also Read : Mla Jagga Reddy : సీఎం జగన్, షర్మిల బీజేపీ వదిలిన బాణాలే, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు