Rajasthan Crime News:


మైనర్ బాలికపై పోలీస్ అత్యాచారం..


రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ఎస్‌ఐ. స్థానికంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. లాల్‌సోట్‌ ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. SI భూపేంద్ర సింగ్ మధ్యాహ్నం బలవంతంగా ఓ నాలుగేళ్ల బాలికను తన గదిలోకి లాక్కెళ్లాడి...ఆ తరవాత అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే...ఆ బాలిక వయసెంత అన్నది మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తైన తరవాతే చెబుతామని తెలిపారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ధ్రువీకరించేంత వరకూ ఈ విషయంలో ఏ వివరాలూ చెప్పేలమని అన్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్‌ని ముట్టడించారు. పెద్ద ఎత్తున స్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అటు బీజేపీ నేతలూ తీవ్రంగా మండి పడుతున్నారు.ఇది మానవత్వానికే మచ్చ అంటూ కొందరు బీజేపీ నేతలు ట్వీట్‌లు చేస్తున్నారు. గహ్లోట్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. బీజేపీ నేత షెహజాద్‌ పూనావాలా ట్విటర్‌లో రాజస్థాన్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 


"నాలుగేళ్ల బాలికపై SI అత్యాచారం చేశాడు. దీనిపై పలు చోట్ల ఆందోళనలు జరుగుతున్నాయి. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గహ్లోట్ రాజ్యంలో రక్షకులే భక్షకులు అవుతున్నారు. పోలీసులే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు. రాజస్థాన్‌లో ఇలాంటి ఘటనలు రోజుకి కనీసం 20-22 వరకూ జరుగుతున్నాయి. ఏదో ఓ చోట మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి. కానీ ప్రియాంక గాంధీ మాత్రం నోరు మెదపరు. అత్యాచారాల్లోనే నంబర్ వన్ రాష్ట్రంగా రాజస్థాన్‌ మారిపోయింది"


- షెహజాద్ పూనావాలా, బీజేపీ నేత