Cyber Crime : నిన్న మొన్నటి వరకు సామాన్యుల పేర్లతో సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసి స్నేహితులు, బంధువులను డబ్బులు అడుగుతూ చీట్ చేసేవారు సైబర్ కేటుగాళ్లు. ఇటీవల స్ట్రాటజీ మార్చిన సైబర్ నేరగాళ్లు ఉన్నతాధికారుల ఫొటోలు, పేర్లను వాడేస్తూ కింది స్థాయి అధికారులతో సహా సామాన్యుల వద్ద డబ్బు కొట్టేస్తున్నారు. ఉన్నతాధికారుల ఫొటోలు, పేరుతో చీటింగ్ చేస్తున్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కలెక్టర్ , ఎస్పీ పేరుతో తరచుగా ఫేక్ ఐడీలు క్రియేట్ చేస్తూ కిందిస్థాయి సిబ్బందికి మెసేజ్ పంపుతూ డబ్బులు అడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ నేరానికి ప్రయత్నించిన కేటుగాళ్లు ఈసారి ఏకంగా బెదిరింపులకు దిగారు. ఇలాగే ఓ అధికారికి కలెక్టర్ అనురాగ్ జయంతి పేరుతో వాట్సాప్ లో మెసేజ్ వచ్చింది. గతంలో జరిగిన సంఘటనతో అప్రమత్తమైన కిందిస్థాయి  అధికారి నువ్వు ఎవరు? అంటూ అతన్ని ప్రశ్నించాడు. దీంతో రెచ్చిపోయిన సైబర్ నేరగాడు ప్రొఫైల్ లో తన ఫోటో చూస్తే తెలియడం లేదా? రాను రాను మేనర్స్ లేకుండా పోతోందంటూ అధికారిని బెదిరించాడు.  


అమెజాన్ గిఫ్ట్ కార్డులతో మోసం  


ప్రొఫైల్ లో చూస్తే జిల్లా కలెక్టర్ ఫోటో ఉంది. అయితే ఆ  అధికారి కాస్త గట్టిగానే రిప్లై ఇచ్చాడు. నేను ప్రధాని మోదీ ఫొటో ప్రొఫైల్ పిక్చర్ లాగా పెట్టుకోగలను అంటూ రిప్లై ఇవ్వడమే కాకుండా ఆ కేటుగాడ్ని నువ్వెక్కడున్నావో చెప్పు అన్నాడు అధికారి. నేను కలెక్టరేట్ లోనే ఉన్నాను అంటూ రిప్లై ఇచ్చాడు సైబర్ నేరగాడు. డబ్బులు అడిగితే అలర్ట్ అవుతున్నారని అమెజాన్ గిఫ్ట్ కార్డులు కావాలంటూ దీనికి సంబంధించి డబ్బులను ఒక గంటలోనే అరెంజ్ చేస్తానంటూ మెసేజ్ లో చెబుతున్నారు. అయితే ఈ విషయం కలెక్టర్ కి చేరడంతో మరోసారి ఎవరు ఇలాంటి మెసేజ్ కు స్పందించి డబ్బులు పంపవదంటూ కలెక్టర్ ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇటీవల ఇలాగే జరిగిందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.



ఎస్పీకి తప్పని తిప్పలు  


మరోవైపు ఈ మధ్య రాజన్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే పేరుతో ఓ నకిలీ ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసిన నేరగాళ్లు పలువురిని ఆ ప్రొఫైల్ ద్వారా కాంటాక్ట్ చేశారు. ఆ సమయంలోను ఎస్పీ అప్రమత్తమై అందరినీ అలర్ట్ చేశారు.  నిజానికి ఎవరైనా సరే ప్రొఫైల్లో తమ ఫొటో కంటిన్యూగా మెయింటైన్ చేస్తే వారిని సైబర్ క్రిమినల్ టార్గెట్ చేసుకుంటారు. ఇక ఉన్నతాధికారులైతే కింది స్థాయి సిబ్బంది మారు మాట్లాడకుండా చెప్పిన పనిచేస్తారని ఆలోచన ఈ క్రిమినల్స్ ని ఇలా తెగించేలా చేస్తుంది. ఏదేమైనా టాప్ అఫిషియల్ కి సైబర్ చోర్ల నుండి ఇలాంటి సమస్య ఎదురవుతున్నప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? అని అందరూ చర్చించుకుంటున్నారు. 


Also Read: Finger Print Surgery Scam : హైదరాబాద్ లో కొత్త దందా, గల్ఫ్ దేశాలకు వెళ్లేందుకు ఫింగర్ ప్రింట్ సర్జరీలు!


Also Read : అక్కడ తల్లి, ఇక్కడ తండ్రి చనిపోతూ పిల్లల ప్రాణాలు తీశారు