ajahmundry Crime News: అఖండ గోదావరి తీరంలో లేలేత సూర్య కిరణాలు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న తరుణంలోనే అమానవీయ సంఘటన వెలుగు చూసింది. మానవీయత మంటగలిసి పోయి అసలు ఎక్కడ బ్రతుకుతున్నామన్న సందేహం కల్గేలా చేశాయి అక్కడి దృశ్యాలు. తల్లి గర్భం నుంచి నవజాత శిశువులుగా బయటకొచ్చి ఎంతో బంగారు భవితను చూడాల్సిన శిశువులు రోజులు కూడా గడవకుండానే తనువు చాలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజమండ్రి గోదావరి తీరంలో నవజాతశిశువుల మృత దేహాలను కుక్కలు పీక్కుని తింటున్న దృశ్యాలు అక్కడి వారిని కంటనీరు పెట్టించాయి. ఈ సంఘటనను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలోని కోటిలింగాల వద్ద గోదావరి గట్టుపై రెండు పసికందుల మృతదేహాలను కుక్కలు పీక్కుని తింటున్న దృశ్యాలు కలకలం రేపాయి. ఉదయాన్నే అటు వైపుగా వెళ్లిన స్థానికులు విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. హృదయాలను కలచి వేసేలా ఆ దృశ్యాలు ఉండడంతో స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. నవజాత శిశువులను పొత్తిళ్ల నుంచి తీసుకు వచ్చి మహాప్రస్థానం సమీపంలో పడేయడంతో ఈపరిస్థితి చోటు చేసుకుందని తెలుస్తోంది. మృతదేహాలను పడేశారా, లేక బ్రతికుండగానే అక్కడ వదిలి వెళ్లారా అన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటనా స్థలానికి రాజమండ్రి మూడో పట్టణ పోలీసులు చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కుక్కలు తినేయగా మిగిలి ఉన్న మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..
కోటిలింగాల గట్టుకు సమీపంలోని మహాప్రస్థానం వద్ద పడేసి వెళ్లిన శిశువుల మృతదేహాలను స్వాదీనం చేసుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకు తరలించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరా పుటేజీలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఈ అమానవీయ సంఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం వేళ ఇంతటి దారుణమైన ఘటనను కళ్ల చూడాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు శిశులను బ్రతికుండగానే వదిలి వెళ్లారా.. లేక మృత దేహాలను తీసుకొచ్చి ఇలా పడేశారా అన్నదానిపై అంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రెండు నెలల క్రితం అచ్యుతాపురం సెజ్ లో నవజాత శిశువు..!
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రెండు నెలల క్రితం అమానుష ఘటన చోటు చేసుకుంది. క్యాంటమ్ కంపెనీలోని బాత్రూమ్ లో నవజాత శివువు కలకలం రేపింది. క్వాంటమ్ కంపెనీలో పని చేస్తున్న ఓ మహిళే ఆ బిడ్డను బాత్రూంలో ప్రసవించినట్లు తెలుస్తోంది. పెళ్లి కాకుండా బిడ్డ పుట్టడం వల్లే అక్కడే వదిలి వెళ్లిపోయినట్లు సిబ్బంది భావిస్తున్నారు. ఆ బిడ్డను ప్రసవించిన మహిళ ఎవరో తెలుసుకునేందుకు యాజమాన్యం కంపెనీకి వెళ్లే బస్సుల్లో తనిఖీలు చేస్తోంది. ఈ క్రమంలోనే చిన్నారి గురించి స్థానిక మాతా శిశు సంరక్షణ కేంద్రం సిబ్బందికి తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన సిబ్బంది నవజాత శిశువును తమతోపాటు తీసుకెళ్లారు. అనంతరం యాజమాన్యం పోలీసులకు కూడా విషయాన్ని తెలియజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.