Posani Krishna Murali : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సినీ రచయిత పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు అయింది.  జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గతంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం నేత యందం ఇందిరా ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక రెండో జె.ఎఫ్.సి.ఎం కోర్టు ఆదేశాలతో పోసాని కృష్ణ మురళిపై ఐపీసీ 354, 355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదుపై స్థానిక రెండో జె.ఎఫ్.సి.ఎం కోర్టులో యందం ఇందిరా తరపున వాదనలు అడ్వకేట్ ఏ.వి.ఎం.ఎస్ రామచంద్రరావు వాదనలు వినిపించారు. 


పోసానికి ప్రభుత్వ పదవి 


 వైఎస్ఆర్‌సీపీ నేత, ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణమురళికి సీఎం జగన్ పదవి కేటాయింటారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ ధియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌కు ఛైర్మన్‌గా నియమించారు.  పోసాని కృష్ణమురళి సీఎం జగన్‌కు వీరాభిమాని. ఆయనపై ఎవరైనా విమర్శలు చేస్తే..  బూతులతో విరుచుకుపడతారు.  ముఖ్యంగా పవన్ కల్యాణ్, మెగా ఫ్యామిలీలో అందర్నీ ఆయన అసభ్యంగా దూషించిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. చాలా కాలంగా వైఎస్ఆర్‌సీపీకి నమ్మకంగా పని చేస్తున్నప్పటికీ.. పదవి లభించలేదు. ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల అంశంపై సంప్రదింపులు జరిపినప్పుడు ఆలీతో పాటు పోసానిని కూడా ఆహ్వానించింది. ఆ తర్వాత  పోసాని కృష్ణమురళి మరోసారి సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా కలిశారు. అప్పట్లోనే పదవి లభిస్తుందన్న ప్రచారం జరిగింది. కానీ ఆలస్యంగా ఇప్పుడు పదవి ఇచ్చారు. 


పవన్  కల్యాణ్ పై కేసు 


 జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఇటీవల కేసు నమోదైంది. తాడేపల్లి పోలీసులు ఆయనను ఏ వన్‌గా పెట్టి.. ఆయన కారు డ్రైవర్‌ను ఏ 2గా ఖరారు చేసి కేసు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ వల్ల తనకు బైక్ ప్రమాదం జరిగిందని తెనాలి మోరిస్ పేటకు చెందిన పి. శివ అనే వ్యక్తి తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. పవన్‍పై IPC 336, రెడ్‍విత్ 177MV యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. తెనాలి మోరిస్ పేటకు చెందిన శివ ఇచ్చిన ఫిర్యాదు కాస్త విచిత్రంగా ఉంది.  తాను  నవంబర్ 5వ తేదీన ఇప్పటం  రోడ్ మీద వెళ్తున్న సమయంలో పవన్ కల్యాణ్ కాన్వాయ్ వేగంగా వచ్చిందని... ఆ కాన్వాయ్‌లో మొదటి కారుపై వన్ కల్యాణ్‌పై కూర్చుని ఉన్నారని శివ ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఆ కారును అమిత వేగంతో డ్రైవర్ నడిపించారని శివ  .. అదే వేగంతో చాలా కార్లు వెళ్లాయి. ఈ కారణంగా  అదే రోడ్డుపై బైక్‌పై వెళ్తున్న తాను కిందపడ్డానని ఫిర్యాదులో పేర్కొన్నారు.  తన ప్రమాదానికి కారణం పవన్ కల్యాణ్, అతని డ్రైవరేనని అతడు పదో తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును పోలీసులు నమోదు చేశారు. 


ఇప్పటం పర్యటనకు పోలీసులు అడ్డుకున్న క్రమంలో  కారుపై కూర్చుని వెళ్లిన పవన్ 
 
ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ అక్కడి ప్రజలకు అండగా ఉండేందుకు ఐదో తేదీన పవన్ కల్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్లారు. మొదట ఆయన వాహనాలతో వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. అయితే పవన్ నడుచుకూంటూ వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కొంత దూరం పోయిన తర్వాత పోలీసులు వాహనాలకు అనుమతి ఇచ్చారు. అప్పుడు పవన్.. కారుపైకి ఎక్కి కూర్చుని వెళ్లారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  జన సైనికులు ఆయన స్టైల్ సూపర్ అని పొగిడారు. అలా వెళ్లడం నిబంధనలను ఉల్లంఘించడం.. నిర్లక్ష్యమని ఇతర పార్టీల నేతలు విమర్శలు గుప్పించారు.