తమిళంలో బ్లాక్‌బస్టర్ అయిన ‘లవ్‌టుడే’ సినిమా ఇప్పుడు తెలుగులో విడుదలకు సిద్ధం అయింది. నవంబర్ 25వ తేదీన ఈ సినిమాను తెలుగులో విడుదల చేయనున్నారు. ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ప్రదీప్ రంగనాథన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం మాత్రమే కాకుండా ఇందులో హీరోగా కూడా నటించాడు. తనకు జోడిగా ఇవానా కనిపించింది. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందించారు. ఆడియో పరంగా కూడా ఈ సినిమా పెద్ద హిట్.


నవంబర్ 25వ తేదీన మూడు సినిమాలు విడుదల కానున్నాయి. అల్లరి నరేష్ నటించిన ‘ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం’, వరుణ్ ధావన్ నటించిన ‘భేడియా (తెలుగులో తోడేలు)’లతో ‘లవ్ టుడే’ పోటీ పడనుంది. వీటిలో డబ్బింగ్ సినిమాలు అయిన ‘భేడియా’ను అల్లు అరవింద్, ‘లవ్ టుడే’ను దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు.


‘లవ్ టుడే’ ట్రైలర్‌ను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కొంచెం కొత్తదనం కనిపిస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో కామెడీని మిక్స్ చేసి సరదాగా సాగిపోయేలా తీశారు దర్శకుడు ప్రదీప్. హీరో ఉత్తమన్ ప్రదీప్, నికిత ప్రేమించుకుంటారు. నికిత తండ్రిని ఒప్పించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ప్రదీప్. అయితే నికిత తండ్రి సత్యరాజ్ ఒక మెలిక పెడతాడు. వీరిద్దరూ ఒక రోజు తమ మొబైల్స్ మార్చుకుని తర్వాత రోజు కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని  చెప్తాడు.


దీంతో ప్రదీప్, నికిత తమ స్మార్ట్ ఫోన్‌లను మార్చుకుంటారు. అయితే ఫోన్లు మార్చుకున్న తర్వాత ప్రదీప్, నికిత తమ రహస్యాలు బయటికి వస్తాయనే ఆందోళన మొదలవుతుంది. తర్వాత వారు ఒకరి ఫోన్‌ను మరొకరు చెక్ చేసుకోవాలని అనుకుంటారు. ఫోన్లు అన్ లాక్ చేసిన తర్వాత ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు ? తర్వాత ఏమవుతుంది ? చివరికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా విడిపోతారా ? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. సినిమా ప్రస్తుత సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండటంతో ఆసక్తి నెలకొంది. సినిమాలో సత్యరాజ్, యోగి బాబు, రాధికా శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.