Pune Road Rage Incident: పుణేలో స్కూటీపై ఇద్దరు పిల్లలతో వెళ్తున్న మహిళను వృద్ధ దంపతులు వేధించారు. ఓర్‌ టేక్ చేసేందుకు సైడ్ ఇవ్వలేదన్న కోపంతో ఆ మహిళను ఆపి దాడి చేశారు. జుట్టు పట్టుకుని లాగి ముఖంపై గట్టిగా కొట్టారు. ఈ ధాటికి ముక్కు పగిలిపోయి తీవ్ర రక్తస్రావమైంది. అలా రక్తం కారుతుండగానే బాధితురులు సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అయిన బాధితురాలు ఏం జరిగిందో ఈ వీడియోలో వివరించింది. స్కూటీపై ఇద్దరు పిల్లలతో కలిసి వస్తుండగా దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఆ కార్‌ వెనకే వచ్చిందని, ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించారని చెప్పింది. కార్‌ వెళ్లేందుకు స్పేస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో రోడ్‌కి పక్కగా స్కూటీ ఆపేసింది. ముందుకు వెళ్లిపోయిన కార్‌లో నుంచి ఓ వ్యక్తి దిగాడు. చాలా కోపంగా వచ్చి జుట్టు పట్టుకుని లాగాడు. ఆ తరవాత గట్టిగా ముఖంపై కొట్టాడు. ఈ దాడిలో ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. "నన్ను రెండు సార్లు కొట్టాడు. జుట్టు పట్టుకుని లాగాడు. మనుషులు మరీ ఇంత దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు. ఆ సమయంలో నా ఇద్దరు పిల్లలూ నాతోనే ఉన్నారు. వాళ్లకు ఏమైనా జరుగుతుందేమోనని భయపడిపోయాను" అని బాధితురాలు వీడియోలో చెప్పింది. 


ఏ కారణం లేకుండానే వాళ్లు వచ్చి దాడి చేసినట్టు ఆరోపించింది బాధితురాలు. కేవలం ఓవర్ టేక్ చేసేందుకు అంత సేపూ సైడ్ ఇవ్వలేదన్న కోపంతనే దాడి చేశాడని చెప్పింది. ఈ ఘటనలో పిల్లలకు ఏమీ కాకపోయినా బాగా భయపడిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే ఆ దంపతులను అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు.