Rajampet Jail | రాజంపేట: సినిమాల్లో కామెడీ కోసం కొందరు ఖైదీలు పారిపోయే సీన్లు చూస్తుంటాం. మరికొన్ని సినిమాల్లో పోలీసులకు చెప్పి మరీ ఖైదీలు తప్పించుకోవడం చూసి ఉంటారు. కానీ అప్పుడప్పుడు రియల్ గానూ కొందరు ఖైదీలు పోలీసుల కళ్లు గప్పి పరారవుతుంటారు. సరిగ్గా అలాంది ఘటనే అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో జరిగింది. ఓ ఖైదీ రాజంపేట జైలు నుంచి పరార్ కావడంతో పోలీసులు టెన్షన్ పడుతున్నారు.


రైల్వే కోడూరుకు చెందిన భాషా జైలు నుంచి పరారైన ఖైదీగా గుర్తించారు. విషయంపై సీరియస్ అయిన నెల్లూరు రేంజ్ జెళ్ళ శాఖా డి.ఐ.జి రాజేశ్వర రావు రాజంపేట సబ్ జైలులో విచారణ చేపట్టారు. సబ్ జైలు అధికారులను అడిగి వివరాలు ఆరా తీశారు. బాషా గత ఏడాది నవంబరు నుంచి ఓ హత్య కేసులో రిమాండులో ఉన్నాడు. గురువారం నాడు ఖైదీలను జైలు గది నుంచి బయటకు వంట చేయడానికి వదిలారు. ఆ సమయంలో దుప్పటిని తాడుగా మలుచుకుని బాషా అనే ఖైదీ గోడ దూకి పరారయ్యాడు. కాసేపటికి ఖైదీ జైలు నుంచి తప్పించుకున్నట్లు గుర్తించారు పోలీసులు. విషయం తెలుసుకున్న జైలర్ మల్లా రెడ్డి ఖైదీ బాషా పరారీపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  


జైలు నుంచి బాషా అనేది ఖైదీ తప్పించుకోవడంపై అధికారులు శాఖ పరమైన విచారణ చేపట్టారు. నిర్లక్ష్యం కారణంగానే ఖైదీ పరారయ్యాడా అనే కోణంలోనూ విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు విధుల్లో ఉన్న వార్డెన్ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. జైలర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఖైదీ పరారీపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అర్బన్ సీఐ మద్దయ్యచారి తెలిపారు.