BRS MLAs KTR and Harish Rao meets MLC Kavitha In Tihar jail in New Delhi | హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జులై 18 వరకు ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం నాడు తీర్పు ఇచ్చింది. ఈ ఏడాది మార్చి నెలలో హైదరాబాద్ కు వచ్చిన ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేసి, ఢిల్లీకి తరలించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలో సీబీఐ సైతం కవితను అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా కూడా తిహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. 


ఢిల్లీలో కవితతో కేటీఆర్, హరీష్ రావు ములాఖత్
లిక్కర్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం ఢిల్లీ తీహార్ జైలులో ఉన్నారు. శుక్రవారం (జులై 5న) ఉదయం ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్ అయ్యారు. ఆమెతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని సూచించారు. న్యాయవ్యవస్థ పైన తమకు పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ లభిస్తుందని కవితకు వారు ధైర్యం చెప్పారు. కేసు విషయంలో మనం వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని, ధైర్యం పోరదామన్నారు. కేసులో జరిగిన వాదనలపై ముగ్గురు కాసేపు చర్చించారు. బెయిల్ రావడానికి ఉన్న అవకాశాలపై ఫోకస్ చేశారు.


ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఎమ్మెల్సీ కవిత బెయిల్ అభ్యర్థన తిరస్కరించడం తెలిసిందే. దాంతో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ తన కుమార్తెకు మద్దతుగా నిలిచారు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరిస్తే.. సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీకి వెళ్లి తిహార్ జైలులో కవితతో ములాఖత్ అయ్యారు. సుప్రీంకోర్టులో వేయనున్న కవిత బెయిల్ పిటిషన్ పై అక్కడే సీనియర్ లాయర్ల టీమ్ తో చర్చిస్తున్నారు. సుప్రీంకోర్టు సెలవులు ముగియగానే ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. బెయిల్ పిటిషన్ వేసే దాకా ఢిల్లీలోనే ఉంటూ లాయర్ల టీమ్ తో సమన్వయం చేసుకోవాలని కేటీఆర్, హరీష్ భావిస్తున్నారు. సుప్రీంకోర్టులో సోమవారం నాడు కవిత బెయిల్ పిటిషన్ వేసే అవకాశం ఉందని సమాచారం.