Pregnant Lady Forcrful Death In Penamaluru: తమకు వారసుడు కావాలనే అత్తింటి వారి వేధింపులను ఆ మహిళ తట్టుకోలేకపోయింది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన కృష్ణా (Krishna) జిల్లాలో జరిగింది. పెనుమలూరు (Penamaluru) మండలం రామలింగేశ్వర నగర్‌కు చెందిన  కావ్యశ్రీ (19) అనే గర్భిణీ ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కొన ఊపిరితో ఉన్న ఆమెను గమనించిన భర్త, అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


'వారసుడి కోసం వేధించారు'


తన కూతుర్ని అత్తింటి వారు వారసుడి కోసం మానసికంగా వేధించారని మృతురాలి తల్లి రాజేశ్వరి, బంధువులు ఆరోపించారు. మొదటి కాన్పులో అమ్మాయి పుట్టిందని.. రెండో కాన్పూలోనూ అమ్మాయే పుడుతుందేమో అని అబార్షన్ చేయించుకోవాలంటూ ఒత్తిడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకు తమ కుమార్తె నిరాకరించడంతో బలవంతం చేశారని అన్నారు. 'అల్లుడు పాతపాడు సచివాలయంలో టౌన్ ప్లానింగ్‌లో పని చేస్తున్నాడు. చదువుకుని కూడా మూర్ఖత్వపు ఆలోచనలు చేశాడు. నా కుమార్తెకు అబార్షన్ చేయించడానికి ఆస్పత్రుల చుట్టూ తిప్పాడు. పాప పుట్టి 10 నెలలు కూడా అవలేదని.. అబార్షన్ వద్దని ఎంత వారించినా మా మాట వినలేదు. వారసుడి కోసం మా అమ్మాయిని మానసికంగా చిత్రహింసలు పెట్టారు.' అని వాపోయారు.