Prakasam Accident : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం శివారు ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా కారు, ఆటో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలో ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. మిర్చి కోతకు కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది. ఆటోలో ఇద్దరు, కారులో ఉన్న వారిలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డవారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయచర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనలో మరో 10 మందికి తీవ్రగాయాలు అయినట్లు సమాచారం. వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు మొగుళ్లపల్లికి చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణాలను బాధితులను అడిగితెలుసుకుంటున్నారు పోలీసులు.
కూలీ పనులకు వెళ్లి తిరిగిరాని లోకాలకు
ఎర్రగుంటపాలెం మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన మహిళలు మిరపకాయ కోత కూలీ పనికి బోయలపల్లి వెళ్లారు. పని పూర్తి చేసుకుని తిరిగి ఆటోలో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో మార్కాపురం వెళ్తోన్న కారు బోయియలపల్లి నుంచి మొగుళ్లపల్లి వెళ్తోన్న ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళా కూలీలు, కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందారు.
గత నెలలో కూడా ప్రమాదం
ప్రకాశం జిల్లాలో గత నెలలో కూడా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో, ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. కొమరోలు మండలం తాటిచెర్లమోటు దగ్గర ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా మరోకరికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
ఫిబ్రవరి నెలలోనే మరో ప్రమాదంలో లారీ-బొలేరో వాహనం ఢీకొని నలుగురు దుర్మరణం పాలయ్యారు. బేస్తవారిపేట మండలం పెంచికలపాడు గ్రామ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది కోడె దూడలు కూడా మృతిచెందాయి. గిద్దలూరు నుంచి గుంటూరు వెళుతున్న మిర్చి మినీ లారీ కోదాడ నుంచి ఆవులతో వస్తున్న బొలోరేను ఢీకొట్టింది. ఆ ఘటనలో మరువక ముందే తాజాగా యర్రగొండపాలెం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు.
Also Read : Girl Suicide: బాలిక మిస్బా మరణానికి వైసీపీ నేత కారణమా? సూసైడ్ నోట్‌లో ఏముందంటే