ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని బేస్తవారిపేట మండలం పెంచికలపాడు వద్ద అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై ఎదురెదురుగా డీసీఎం వ్యాన్, మినీ లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా నుంచి మిర్చి లోడుతో వెళ్తోన్న డీసీఎం వ్యాన్ కోదాడ నుంచి ఆవులు, కోడె దూడలతో వస్తున్న మినీ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. 8 కోడె దూడలు కూడా ప్రాణాలు కోల్పోయాయి. మరో ఇద్దరు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. వీరిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే చనిపోగా మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటంతో గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 


మేడ్చల్ రోడ్డు ప్రమాదం


మేడ్చల్ జాతీయ రహదారి కండ్లకోయ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పూల వ్యాపారులు మరణించారు. తూప్రాన్ నుంచి గుడి మల్కాపూర్ పూల మార్కెట్‌కు కారులో వెళ్తుండగా అతి వేగంతో వచ్చిన వాహనం వీరి కారును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


సూర్యపేటలో పేలిన ట్యాంకర్ 


సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ పేలి ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. లారీ డీజిల్ ట్యాంకర్‌కు గ్యాస్ వెల్డింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతిచెందిన వారిలో సూర్యాపేట కూరగాయాల మార్కెట్ కు చెందిన వెల్డింగ్ షాపు యజమాని మంత్రి అర్జున్(36), కుడకుడ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ గట్టు అర్జున్(45)లుగా పోలీసులు గుర్తించారు. వెల్డింగ్ దుకాణం యజమానికి కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. డ్రైవర్ గట్టు అర్జున్‌కి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ప్రమాదం విషయం తెలిసిన వెంటనే పట్టణ సీఐ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ప్రమాదస్థలిని పరిశీలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు అంటున్నారు. ట్యాంకర్‌ ఖాళీగానే ఉన్నప్పటికీ గ్యాస్ ఫామ్ కావడం వెల్డింగ్ చేస్తున్న సమయంలో వేడికి మంటలు అంటుకొని భారీ శబ్దంతో పేలుడు సంభవించి ఉంటుందని స్థానికులు అంటున్నారు.