పరుపు ఓ మహిళ ప్రాణాలు కాపాడింది. నీటిలో మునిగిపోకుండా రక్షించింది. అదేంటీ.. ఇంట్లో ఉండాల్సిన పరుపు నీటిలోకి ఎలా వచ్చిందనేగా మీ సందేహం. అయితే, అమెరికాలో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి తెలుసుకోవల్సిందే. 


కోని అనే మహిళ ఫిబ్రవరి 3వ తేదీన తన ప్రియుడితో కలిసి ఓక్లహోమా-టెక్సాస్ సరిహద్దులోని టెక్సోమా సరస్సు వద్దకు వెళ్లింది. మంచు వల్ల సరస్సు గడ్డ కట్టడంతో వారు పడవ వద్దకు చేరుకొనేందుకు గాలి పరుపును ఉపయోగించారు. సరస్సులో కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత కోని ప్రియుడు సరస్సులోకి దూకి ఈదుకుంటూ పడవలోకి చేరుకున్నాడు. అయితే, కోని మాత్రం భయపడి గాలి పరుపుపైనే ఉండిపోయింది. అయితే, ఆ పరుపు నీటిలో సుమారు 3 కిలోమీటర్ల దూరం కొట్టుకెళ్లిపోయింది. 


ఆమె ప్రియుడు ఆమెకు కనీసం సాయం చేయలేదు. మంచు వర్షం తీవ్రత ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కోని -10 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతల మధ్య రెండు రోజులపాటు తీవ్రమైన చలిని తట్టుకుంటూ బిక్కుబిక్కుమంటూ గడిపింది. ఎలాగోలా ఆమె.. ఆ పరుపు సాయంతో రైల్వే ట్రాక్ సమీపంలోని ఓ మట్టి దిబ్బ వరకు చేరుకోగలిగింది. అక్కడే కొన్ని గంటలు పరుపు కిందకు దూరి చలి నుంచి తనని తాను రక్షించుకొనే ప్రయత్నం చేసింది.


కొన్ని గంటల తర్వాత ఆమెకు ఓ రైలు అటుగా వస్తూ కనిపించింది. దీంతో కోని ఆ రైలు వైపు చూస్తూ.. చేతులు ఊపింది. ఆమెను గమనించిన రైలు కండక్టర్ ఓక్లహోమా హైవే పెట్రోలింగ్ సిబ్బంది సమాచారం అందించాడు. ఈ సమాచారం అందగానే సహాయక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని కోనికి సాయం చేశారు. అనంతరం ఆమె హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. -10 డిగ్రీల చలిలో, గడ్డకట్టిన సరస్సు మీద రెండు రోజులు ఆమె ప్రాణాలతో ఉండటం నిజంగా ఆశ్చర్యకరమని అధికారులు తెలిపారు. అయితే, ఆమె ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని అధికారులకు తెలపని ప్రియుడిపై కేసు నమోదు చేసి.. అతడి కోసం గాలిస్తున్నారు.