Jani Master Produced In Court: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను (Jani Master) నార్సింగి పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో జానీ మాస్టర్‌ను శుక్రవారం తెల్లవారుజామున గోవా నుంచి హైదరాబాద్ (Hyderabad) తీసుకొచ్చి రహస్య ప్రదేశంలో విచారించారు. పలు కీలక అంశాలపై ఆరా తీశారు. హైదర్‌గూడలోని ఓ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. కోర్టు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. జానీ మాస్టర్‌పై పోక్సో యాక్ట్ నమోదు చేయడంతో ఆయన తరఫు న్యాయవాది రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేయనున్నారు.


ఇదీ జరిగింది


మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి 2017లో ఓ డాన్స్ షోలో పాల్గొనగా.. ఆ షోకి జడ్జిగా జానీ మాస్టర్ ఉన్నారు. ఆమె ప్రతిభ చూసిన అనంతరం తన వద్ద డ్యాన్స్ అసిస్టెంట్‌గా అవకాశం ఇప్పిస్తానని జానీ హామీ ఇచ్చారు. అలా 2019 నుంచి ఆ యువతి ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేస్తోంది. ఈ క్రమంలో తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని జానీ మాస్టర్‌పై యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మైనర్‌గా ఉన్న సమయంలోనే హోటల్‌లో తనపై అత్యాచారం చేశారని యువతి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనంతరం నార్సింగి పీఎస్‌కు కేసు బదిలీ చేశారు. తాను మైనర్‌గా ఉన్న సమయంలోనే హోటల్‌లో తనపై జానీ అత్యాచారం చేశారని పోలీసులు ఫిర్యాదులో పేర్కొనగా.. పోక్సో యాక్ట్ సైతం జత చేశారు. ఆరోపణలు వచ్చిన అనంతరం జానీ మాస్టర్ పరారీలో ఉండగా.. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందం గోవాలో ఆయన్ను అరెస్ట్ చేసింది. మరోవైపు, ఈ వ్యవహారం టాలీవుడ్ పరిశ్రమను కుదిపేస్తోంది. బాధితురాలికి పలువురు అండగా నిలిచారు. 


Also Read: Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం