శ్రీకాకుళం జిల్లాలో వేసవి వచ్చిందంటే చాలా పల్లెల్లో గ్రామదేవతల సంబరాలు, జాతరలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ వేడుకలకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా భక్తులు వస్తుంటారు. ఈ సందర్భంగాన్ని వినియోగించుకొని వ్యాపారం చేసుకోవాలని చూస్తుంటారు వ్యాపారులు. ఇది సహజంగానే జరిగే ప్రక్రియ.
ఈ జాతరలను సొమ్ము చేసుకోవడానికి కొందరు ఒడిశా వాసులు, ఇచ్చాపురంలోని వ్యక్తులతో కుమ్మక్కై కొత్త వ్యాపారానికి షటర్ తెరిచారు. మారుమూల ప్రాంతంలోని కొండపై బస చేశారు. యంత్రసామగ్రి, విద్యుత్ పరికరాలు రెడీ చేసుకున్నారు. ఇంతలో పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రైడ్ జరిగింది. దీంతో అక్కడ ఎలాంటి వ్యాపారం జరుగుతుందో గుట్టు రట్టు అయింది.
నాటు సారా తయారు చేసి ఇచ్చాపురం నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో సరఫరా చేయాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసింది. కంచిలి పోలీసులు ఈ టీమ్ ఎత్తుగడను చిత్తు చేశారు. పోలీసులు, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అధికారులు నిర్వహించిన దాడిలో 2,500 లీటర్ల నాటుసారా పట్టుకున్నారు. ముగ్గర్ని అరెస్ట్ చేశారు.
ఒడిశాలోని గొంగపూర్ నుంచి రా మెటీరియల్ తీసుకొచ్చి నాటుసారా తయారీకి ప్లాన్ చేశారు. కంచిలి మండలంలోని రాగపురం సమీపంలోని కొండపై దుకాణం తెరిచారు. కంచిలి మండలం పరిధిలోని గ్రామాల్లో జరిగే సంబరాల్లో భారీగా నాటు సారా అమ్ముకొని భారీగా డబ్బు సంపాదించాలని స్కెచ్ వేశారు.
వాళ్ల ప్లాన్‌ను చిత్తు చేశారు పోలీసులు, ఎస్ ఈ బి అధికారులు. దాడులు చేసి ప్యాకింగ్ చేసిన, వేరుగా నిల్వ ఉంచిన 2500 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. భారీ స్థాయిలో నాటు సారాయిని పట్టుకున్న కంచిలి పోలీసులను ఎస్పీ అభినందించారు.
ఇలాంటి వాళ్లు ఎక్కడున్నా సమాచారం ఇవ్వాలని... నాటు సారా తాగి ఆరోగ్యాలు పాడుచేసుకోవద్దని పోలీసులు ప్రజలకు సూచించారు.