Police Identified The Deadbody In Parcel In Undi: ప.గో జిల్లా ఉండి మండలం యండగండి (Yendagandi) గ్రామంలో 4 రోజుల క్రితం ఓ ఇంటికి పార్శిల్‌లో మృతదేహం వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. ఆ మృతదేహం కాళ్ల మండలంలోని గాంధీనగరం వాసి బర్రె పర్లయ్యదిగా గుర్తించారు. దీంతో మృతుడి స్వగ్రామానికి వెళ్లి పోలీసులు విచారించారు. తులసి అనే మహిళకు వచ్చిన ఇంటి నిర్మాణ సామగ్రి పార్శిల్‌లో శవం కనిపించింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. తులసి ఫోన్‌కు మెసేజ్ పంపిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఆమె మరిది శ్రీధర్ వర్మపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగిన రోజు అతను అదృశ్యం కాగా.. ఆచూకీ కోసం హైదరాబాద్ వెళ్లి గాలిస్తున్నారు. అలాగే, పార్శిల్ పంపిన ఎర్ర కారులోని మహిళ కోసం గాలింపు చేపట్టారు.


ఇదీ జరిగింది


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప.గో జిల్లా ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి అనే మహిళకు గ్రామంలో ప్రభుత్వం నుంచి స్థలం మంజూరు కాగా ఇల్లు నిర్మిస్తోంది. ప్రస్తుతం ఇల్లు ప్లాస్టింగ్ స్టేజీలో ఉండగా.. నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం క్షత్రియ సేవా సమితికి ఆమె అప్లై చేసుకుంది. తొలి విడతలో సేవా సమితి టైల్స్ అందజేసింది. మరోసారి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేయగా.. మరోసారి పార్శిల్‌ వచ్చింది. అందులో ఎలక్ట్రిక్ సామగ్రి ఉంటుందని భావించి ఓపెన్ చేయగా మృతదేహం కనిపించింది. సుమారు 45 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని ఓ మగ వ్యక్తి మృతదేహం సగ భాగం ఉన్నట్లు గుర్తించారు. దీంతో మహిళతో పాటు కుటుంబసభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. స్థానికులు సైతం భయాందోళనకు గురయ్యారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. 


జిల్లా ఎస్పీ నయీం అస్మి ఘటనా స్థలానికి చేరుకున్నారు. పార్శిల్‌లో డెడ్ బాడీతో పాటు ఓ లెటర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అందులో రూ.1.30 కోట్లు చెల్లించాలని.. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారని రాసి ఉంది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Jr NTR : క్యాన్సర్ బారిన పడిన అభిమానికి భరోసా ఇచ్చి మర్చిపోయిన జూనియర్ ఎన్టీఆర్ - అభిమాని తల్లి కీలక వ్యాఖ్యలు