Police arrested Stunden murder accused: అనంతపురంలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని దారుణ హత్య కేసును పోలీసు చేధించారు. నరేష్ అనే యువకుడ్ని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. అతను విద్యార్థినిని ప్రేమ పేరుతో మోసం చేసినట్లుగా గుర్తించారు. పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెచ్చిన విద్యార్థిని అడ్డు తొలగించుకోవాలని నరేష్ చంపేశాడు. నరేష్‌కు అప్పటికే పెళ్లయిపోయి ఉండడంతో అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే నిర్మానుష్య ప్రాంతానికి తన్మయిని తీసుకెళ్లి బండరాయితో మోది చంపినట్లు గుర్తించారు. సీసీ టీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా తన్మయిని నరేష్ తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించి దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
విద్యార్తిని కనబడటం లేదని 4వ తేదీన ఆమె తల్లితండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే రోజు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. 3న ఒక యువకుడితో రాత్రి 9 గంటల సమయంలో బైక్ పై వెళ్లినట్లు సీసీ కెమెరా దృశ్యాలు లభించాయి. విద్యార్థిని కాల్ హిస్టరీ, ఇన్‌స్టా డేటాను పరిశీలించిన పోలీసులు ఇద్దరు యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన తర్వాత పోలీసులు అసలు నిందితుడ్ని గుర్తించారు. నరేష్ అనే యువకుడు భయపడి అంతా చెప్పేశాడు. తానే తన్మయిని చంపేశానని చెప్పాడు. ఆధారాలన్నీ నరేష్ చెప్పిన దానికి సరిపోలడంతో హత్య కేసులో మిస్టరీ వీడిపోయినట్లయింది.
హత్య గురించి తెలిసిన వెంటనే హోంమంత్రి అనిత జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితులను తక్షణం అరెస్టు చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై నారాలోకేష్ కూడా స్పందించారు. అనంతపురం రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని హత్య ఘటన నన్ను తీవ్రంగా కలచి వేసింది. దుండగులు రాక్షస ప్రవృత్తితో మృతదేహాన్ని పెట్రోల్ పోసి తగులబెట్టడం షాక్ కు గురిచేసింది. కూటమి ప్రభుత్వంలో ఉన్మాదులు, సైకోలకి తావులేదు. ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షిస్తాం. హత్యకు గురైన సోదరి కుటుంబానికి అన్నివిధాలా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.
అంతకు ముందు వైసీపీ అధినేత జగన్ కూడా స్పందించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయింది. శాంతి భద్రతల నిర్వహణలో కూటమి ప్రభుత్వం వైఫల్యం ఇలాంటి దారుణాల రూపంలో ప్రతిరోజూ కనిపిస్తూనే ఉంది. అనంతపురంలో ఇంటర్మీడియట్ చదువుతున్న గిరిజన బాలిక ను అత్యంత దారుణంగా హత్యచేశారని ఆరోపించారు. ఆరు రోజుల క్రితం ఫిర్యాదు వచ్చినా సరే ఎందుకు పట్టించుకోలేదు? అసలు రాష్ట్రంలో కేసుల దర్యాప్తు మీద, నేరాల అదుపుమీద అసలు దృష్టి ఉందా? కేవలం రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప.. ఈ ప్రభుత్వానికి ప్రజల రక్షణపట్ల బాధ్యత అనేది ఉందా? తన్మయి హత్యా ఘటనకు ముఖ్యమంత్రి, ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కేసును చాలెంజింగ్ తీసుకున్న పోలీసులు నిందితుడ్ని గంటల్లోనే అరెస్టు చేశారు. ప్రేమికుడని గుడ్డిగా నమ్మి వెళ్లి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది.