Chittoor robbery: బుధవారం తెల్లవారుజామునే చిత్తూరులో కలకలం రేపిన దోపిడీ ప్రయత్నం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలో రబ్బర్ బుల్లెట్లు కాల్చే తుపాకులతో ఇద్దరు దొంగలు కిడ్స్ వరల్డ్ అనే దుకాణం నడిపే యజమాని ఇంట్లోకి చొరబడ్డారు. వారు దోపిడీకి ప్రయత్నించారు.కానీ వారి  ప్రయత్నాలు సక్సెస్ కాలేదు. కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ తిరగబడటంతో పారిపోయారు. ఈ కేసును పోలీసులుసవాల్ గా తీసుకుని గంటల్లోనే చేధించారు. అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.  

తోటి వ్యాపారి వద్ద డబ్బులున్నాయని గుర్తించిన మరో వ్యాపారి           

కిడ్స్ వరల్డ్ షాపు యజమాని చంద్రశేఖర్ కు.. మరో ఫర్నీచర్ షాపు నిర్వహిస్తున్న ఓ వ్యక్తితో స్నేహం ఉంది. ఇరువురి మధ్య చాలా చర్చలు జరుగుతూ ఉంటాయి. ఓ సందర్భంగా కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు ఉందన్న సంగతిని మాటల సందర్భంలో చెప్పాడు.దాంతో ఫర్నీచర్ షాపు యజమాని పెద్ద స్కెచ్ వేశారు. వ్యాపారంలో అప్పటికే నష్టాలు రావడంతో బయటపడటానికి చంద్రశేఖర్ ఇంట్లో దోపిడీ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. ఇందు కోసం కిరాయి గ్యాంగ్ ను మాట్లాడుకున్నాడు. లోకల్ గ్యాంగులు అయితే దొరికిపోతారని.. నైపుణ్యం ఉన్న వారు కావాలని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకున్నారు.        

దోపిడీ చేసి  అప్పులు తీర్చుకోవాలని ప్లాన్              

అలా వచ్చిన వారికి కొద్ది రోజులు రబ్బర్ బల్లెట్ల తుపాకీలతో ట్రైనింగ్ ఇచ్చి..చంద్రశేఖర్ దినచర్యపై పూర్తి వివరాలు సేకరించి..రెక్కీ చేయించి.. ఏ సమయంలో అయితే అనువుగా  దోపిడీ చేయవచ్చో ప్లాన్ చేసి మరీ ఇంటికి పంపారు.అయితే వారికి చంద్రశేఖర్ నుంచి అనూహ్యమైన ప్రతిఘటన ఎదురైంది. దాంతో పరారయ్యారు. దోపిడీ దొంగలు చిత్తూరులో ఎంతో మంది ధనవంతులు ఉండగా.. ఒక్క చంద్రశేఖర్ ఇంటినే ఎందుకు టార్గెట్ చేశారన్నది పోలీసులకు అనుమానంగా మారింది. వెంటనే లభించిన క్లూల ఆధారంగా దర్యాప్తు చేశారు. మెల్లగా తీగలాగితే డొంక కదిలినట్లుగా వ్యవహారం ఫర్నీచర్ షాపు యజమాని దగ్గరకు పోయింది. తనకేమీ తెలియదని అమాయకంగా.. నటిస్తున్న ఆయనను  పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ప్రశ్నిస్తూ ఇతర విషయాలు రాబడుతున్నారు.             

నలుగురు అరెస్టు మరికొంత మంది కోసం గాలింపు              

ఈ ఘటనలో ఇప్పటికి నలుగుర్ని అరెస్టు చేశారు. పారిపోయిన దొంగల్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రబ్బర్ బుల్లెట్లు పేల్చే తుపాకుల్ని ఎక్కడ కొనుగోలు చేశారో ఆరా తీస్తున్నారు. డిజిటల్ ఆధారాలను కూడా సేకరించారు. ఈ వ్యవహారం చిత్తూరులో కలకలం రేపింది. ఫర్నీచర్ షాపు యజమాని ఇలాంటి వాడా అని వ్యాపార ప్రపంచంలో ఉన్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. పోలీసులు ఇంకా పూర్తి వివరాలు బయట  పెట్టలేదు. మిగతా నిందితుల్ని పట్టుకున్న తర్వాత ప్రెస్మీట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి.