New 100 And 200 Rupee Notes With Sanjay Malhotra Signature: 100 రూపాయలు, 200 రూపాయల నోట్లకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలకల ప్రకటన చేసింది. ఆ ప్రకటన ప్రకారం, రిజర్వ్ బ్యాంక్, త్వరలో 100 రూపాయలు & 200 రూపాయల కొత్త నోట్లను విడుదల చేయబోతోంది. మహాత్మాగాంధీ న్యూ సిరీస్‌లో కొత్త నోట్లు వస్తాయి.


కరెన్సీ నోట్ల డిజైన్‌ మారుతుందా?
రిజర్వ్ బ్యాంక్ ప్రకటన ప్రకారం, 100 రూపాయలు & 200 రూపాయల నోట్ల డిజైన్‌లో ఎటువంటి మార్పు ఉండదు, ఇప్పుడు ఉన్నట్లే కొత్త నోట్లు కూడా ఉంటాయి. అయితే, కొత్తగా విడుదల చేయబోయే నోట్లపై ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా ‍‌(RBI Governor Sanjay Malhotra) సంతకం ఉంటుంది. గవర్నర్‌ సంతకంలో మార్పు తప్ప ప్రస్తుతం ఉన్న రూ.100 & రూ.200 కరెన్సీ నోట్లలో ఎలాంటి మార్పు ఉండదు. ఆర్‌బీఐకి కొత్త గవర్నర్ నియామకం తర్వాత, అతని సంతకంతో కూడిన కొత్త కరెన్సీ నోట్లను జారీ చేయడం సాధారణ ప్రక్రియ.


పాత గవర్నర్‌ సంతకం ఉన్న నోట్లు రద్దు అవుతాయా?
ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో కూడిన కొత్త కరెన్సీ నోట్లను మార్కెట్‌లోకి విడుదల చేసినప్పటికీ, పాత గవర్నర్‌ సంతకంతో ఉన్న నోట్లు కూడా చలామణీ అవుతాయి, వాటి చట్టబద్ధతకు ఎలాంటి ప్రమాదం ఉండదు. పాత గవర్నర్‌ శక్తికాంత దాస్‌ (Shaktikanta Das) సంతకంతో ఇప్పటికే ఉన్న 100 రూపాయలు, 200 రూపాయల నోట్లు చెల్లుబాటులో ఉంటాయని, వాటిని మార్చబోమని రిజర్వ్‌ బ్యాంక్‌ స్పష్టం చేసింది. 


కొత్త నోట్లు ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తాయి?
మహాత్మాగాంధీ న్యూ సిరీస్‌లో, కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకంతో ఉన్న కొత్త కరెన్సీ నోట్లు చలామణీలోకి వస్తాయి. కొత్త నోట్లు త్వరలో బ్యాంకులు & ఏటీఎంలలో లభిస్తాయని ఆర్‌బీఐ తెలిపింది, దీనికి స్పష్టమైన తేదీని వెల్లడించలేదు. 


భారతదేశంలో ఇప్పుడు ఎంత నగదు చలామణీలో ఉంది?
రిజర్వ్‌ బ్యాంక్‌ రిపోర్ట్‌ ప్రకారం, రూ. 2,000 నోట్లను విత్‌డ్రా చేసినప్పటికీ, భారతదేశంలో నగదు చలామణి ‍‌(Money circulation in India) గతంలో కంటే ఎక్కువగా ఉంది. ఆర్‌బీఐ డేటాను పరిశీలిస్తే, ఎనిమిదేళ్ల క్రితం, 2017 మార్చి నెలలో దేశంలో మనీ సర్క్యులేషన్‌ రూ. 13.35 లక్షల కోట్లుగా ఉంది. 2024 మార్చి నాటికి అది రూ. 35.15 లక్షల కోట్లకు పెరిగింది. చలామణీలో ఉన్న నగదుతో పాటే UPI ద్వారా డిజిటల్ లావాదేవీలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. 2020 మార్చి నెలలో UPI లావాదేవీలు 2.06 లక్షల కోట్లు కాగా, 2024 ఫిబ్రవరి నాటికి ఆ సంఖ్య 18.07 లక్షల కోట్లకు పెరిగింది. ఒక్క 2024 సంవత్సరం గురించి మాత్రమే మాట్లాడుకుంటే, ఆ సంవత్సరం దాదాపు 172 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి.


ఈ రాష్ట్రాల్లో ATMల నుంచి ఎక్కువ డబ్బు విత్‌డ్రా
రిజర్వ్‌ బ్యాంక్‌ గణాంకాలను బట్టి చూస్తే.. 2023-24 ఆర్థిక సంవత్సరం (FY24)లో దిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రజలు అత్యధికంగా ATMలను ఉపయోగించుకున్నారు, క్యాష్‌ విత్‌డ్రాలు చేశారు. సాధారణంగా, పండుగలు & ఎన్నికలు వంటి కీలక సమయాల్లో భౌతిక నగదుకు డిమాండ్ పెరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ చెల్లింపులు పరిమితంగా ఉండటం వల్ల అక్కడి ప్రజలు నగదును ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.