Medchal Lecturer killed by his wife: మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఒక దారుణ హత్యోదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఒక ప్లే స్కూల్ నడుపుతూ విద్యావంతురాలిగా పేరున్న పూర్ణిమ అనే మహిళ, తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కట్టుకున్న భర్తనే కిరాతకంగా అంతమొందించింది. తన ప్రియుడితో కలిసి పథకం ప్రకారం ఆహారంలో విషం కలిపి భర్తను హతమార్చిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అనుమానాస్పద స్థితిలో లెక్చరర్ అశోక్ మృతి - సాధారణ మరణం అని నమ్మించిన భార్య
మేడిపల్లికి చెందిన అశోక్ వృత్తిరీత్యా లెక్చరర్‌గా పనిచేసేవారు. ఆయన భార్య పూర్ణిమ తమ ఇంట్లోనే ఒక ప్లే స్కూల్ నడుపుతోంది. ఈ నెల 11వ తేదీన అశోక్ తన ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. అయితే, భర్తకు గుండెపోటు వచ్చిందని, అందుకే మరణించాడని పూర్ణిమ బంధువులను, పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. ఆమె మాటలను నమ్మిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. అయితే పోలీసులు మాత్రం .. అనుమానాస్పద మృతిగా ఫిర్యాదు రావడంతో రొటీన్ ప్రాసెస్ లో భాగంగా పోస్టుమార్టం నిర్వహించారు.
రొటీన్ ప్రాసెస్‌లో భాగంగా పోస్టుమార్టం చేయించిన పోలీసులు అశోక్ మృతిపై ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల అందిన పోస్టుమార్టం నివేదికలో దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. అశోక్ మరణంపై పోలీసులు కూడా మొదట పెద్దగా అనుమానం వ్యక్తం చేయలేదు.కానీ పోస్టు మార్టం రిపోర్టులో అశోక్ ది సహజ మరణం కాదని, ఆయనపై విషప్రయోగం జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో పోలీసులు తమ దర్యాప్తును వేగవంతం చేసి పూర్ణిమను లోతుగా విచారించగా అసలు నిజం బయటపడింది. పోలీసులు తమదైన పద్దతిలో షాక్ ట్రీట్ మెంట్ ఇచ్చారు.
పోస్టుమార్టంలో విష ప్రయోగం జరిగినట్లుగా నిర్దారణ - తానే కలిపినట్లుగా అంగీకరించిన భార్య విచారణలో పూర్ణిమ తన నేరాన్ని అంగీకరించింది. ఆమెకు ఒక వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధం విషయం భర్తకు తెలియడంతో ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. ప్రియుడితో కలిసి జీవించాలని భావించిన ఆమె, అశోక్‌ను అడ్డు తొలగించుకోవాలని నిశ్చయించుకుంది. ఈ నెల 11న ఆయన తినే ఆహారంలో విషం కలిపి పెట్టింది. అది తిన్న కొద్దిసేపటికే అశోక్ ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం పోలీసులు పూర్ణిమను అదుపులోకి తీసుకుని, ఆమె ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఉన్నత విద్య చదువుకున్నా.. వివాహేతర బంధాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఇలాంటి వాళ్లు. విడాకులు తీసుకుంటే ముగిసిపోయే బంధాన్ని భర్తలను.. భార్యలను చంపుకుంటున్నారు. పిల్లలను అనాధలను చేస్తున్నారు.