Saudi Arabia: సౌదీ అరేబియాలో గృహ కార్మికుల (Domestic Workers) వేతనాలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జనవరి 1 నుండి ఇళ్లల్లో కార్మికులందరికీ వేతనాలు కేవలం డిజిటల్ పద్ధతిలోనే చెల్లించాలని, నగదు రూపంలో చెల్లింపులను పూర్తిగా నిలిపివేయాలని సౌదీ మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గృహ కార్మికుల హక్కులను రక్షించడానికి , యజమాని-కార్మికుల మధ్య పారదర్శకతను పెంచడానికి సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం, యజమానులు తమ వద్ద పనిచేసే వారి జీతాలను ప్రభుత్వ అధికారిక ప్లాట్‌ఫారమ్ అయిన ముసానెద్' ద్వారా లేదా గుర్తింపు పొందిన డిజిటల్ వాలెట్లు, బ్యాంక్ ఖాతాల ద్వారా మాత్రమే జమ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల జీతాల చెల్లింపుల్లో జాప్యం తగ్గడమే కాకుండా, వివాదాలు తలెత్తినప్పుడు సరైన ఆధారాలు ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కొత్త విధానాన్ని ప్రభుత్వం ఇప్పటికే దశలవారీగా అమలు చేస్తోంది. జూలై 2024 నుండి కొత్తగా సౌదీకి వచ్చే కార్మికులకు ఇది వర్తింపజేశారు. అనంతరం, ఎక్కువ మంది కార్మికులు ఉన్న ఇళ్లకు ఈ నిబంధనను విస్తరిస్తూ వచ్చారు. 2026 జనవరి 1 నాటికి, ఎంతమంది కార్మికులు ఉన్నా సరే, ప్రతి ఒక్కరికీ డిజిటల్ రూపంలోనే వేతనం అందించడం తప్పనిసరి అవుతుంది.
డిజిటల్ చెల్లింపుల వల్ల కార్మికులకు తమ వేతనం సకాలంలో అందుతుందనే భరోసా ఉంటుంది. అలాగే, వారు తమ స్వదేశాల్లోని కుటుంబ సభ్యులకు సులభంగా డబ్బులు పంపుకోవడానికి ఈ విధానం సహకరిస్తుంది. ఒకవేళ కార్మికులకు నగదు అవసరమైతే, వారికి జారీ చేసే 'మడ' (Mada) కార్డుల ద్వారా ఏటీఎంల నుండి డబ్బు తీసుకునే సదుపాయం కూడా ఉంటుంది.
సౌదీలో గృహ కార్మికుల నియామకం, కాంట్రాక్టుల నిర్వహణ అంతా 'ముసానెద్' వేదికగానే జరుగుతోంది. ఇప్పుడు జీతాల చెల్లింపును కూడా దీనికి అనుసంధానించడం ద్వారా, కార్మికుల సేవల ముగింపు ప్రక్రియలు, ప్రయాణ అనుమతులు, ఇతర కాంట్రాక్ట్ సంబంధిత అంశాలను ప్రభుత్వం మరింత వేగంగా, పారదర్శకతతో పర్యవేక్షించనుంది.