Accused Arrested Who Attacked Inter Student With Petrol In Kadapa: కడప జిల్లా (Kadapa District) బద్వేలులో (Badwel) ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి ఘటనలో పోలీసులు నిందితుడు విఘ్నేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, ఇంటర్ విద్యార్థినిని గోపవరం మండలంలోని సెంచరీ ప్లైవుడ్ సమీపంలోని ముళ్ల పొదల్లోకి తీసుకెళ్లిన నిందితుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యార్థిని 80 శాతం కాలిన గాయాలతో కడప రిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితునిపై కఠిన చర్యలకు ఆదేశించారు. దీంతో 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టి గంటల వ్యవధిలోనే నిందితున్ని పట్టుకున్నారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆటో డ్రైవర్‌ను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


ఇదీ జరిగింది


కడప జిల్లా బద్వేల్‌ సమీపంలోని రామాంజనేయనగర్‌కు చెందిన ఇంటర్ విద్యార్థినిపై విఘ్నేశ్ అనే యువకుడు శనివారం మధ్యాహ్నం పెట్రోల్ దాడికి పాల్పడ్డాడు. విద్యార్థిని స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. ఆమెను సెంచరీ ఫ్లైఉడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి మాట్లాడదామని పిలిపించి పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యాడు. హైవేపై తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని గుర్తించిన స్థానికులు కడప రిమ్స్‌కు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బద్వేల్ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అటు, ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అధికారులతో మాట్లాడి విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.


బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన


నిందితుడు విఘ్నేశ్ తమ కుమార్తెను ప్రేమ పేరుతో 8వ తరగతి నుంచే వేధిస్తున్నాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. అతనికి వివాహమైనా వేధింపులు ఆపలేదని.. శనివారం పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని నుంచి జిల్లా జడ్జి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. 'విఘ్నేశ్ నన్ను ప్రేమ పేరుతో వేధించాడు. నీవు లేకుంటే చనిపోతాను అని బెదిరించాడు. అతనికి 6 నెలల క్రితమే వివాహమైంది. తాను కట్టుకున్న భార్య వద్దని నీవే కావాలంటూ నన్ను వేధించాడు. అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడు. నేను అందుకు నిరాకరిస్తే పెట్రోల్ పోసి లైటర్‌తో నిప్పంటించాడు.' అని పేర్కొన్నారు.


ఎస్పీ ఏమన్నారంటే.?


గాయపడిన ఇంటర్ విద్యార్థినికి కడప రిమ్స్‌లో చికిత్స కొనసాగుతున్నట్లు కడప జిల్లా ఎస్పీ హర్షవర్థన్ తెలిపారు. 'విద్యార్థినికి 80 శాతం గాయాలయ్యాయి. చిన్నప్పటి నుంచీ ఇద్దరికీ పరిచయం ఉంది. ఇద్దరూ బద్వేలు రామాంజనేయనగర్‌కు చెందినవారే. తనను కలవాలని విద్యార్థినికి విఘ్నేశ్ ఫోన్ చేశాడు. కలవకపోతే చనిపోతానని బెదిరించాడు. ఇద్దరూ పీపీకుంట చెక్ పోస్ట్ సమీపంలోని ముళ్ల పొదల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థినిపై పెట్రోల్ పోసి నిప్పంటించి విఘ్నేశ్ పరారయ్యాడు.' అని ఎస్పీ పేర్కొన్నారు.


Also Read: Crime News: ఏపీలో దారుణాలు - ప్రేమ పేరుతో వేధింపులు, పురుగుల మందు తాగించి ఒకరు, నిప్పంటించి మరొకరు..