Pawan sanctioned funds to solve the problem of Pure water in Gudivada : ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల కంకిపాడులో జరిగిన ‘పల్లె పండుగ’ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తన నియోజకవర్గంలోని మూడు మండలాల్లోని 43 గ్రామాల్లో తాగునీటి కలుషిత సమస్యను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. సమస్య తీవ్రతను గుర్తించి వేదిక పైనుంచే దానికి శాశ్వత పరిష్కారం చూపుతామని పవన్ హామీ ఇచ్చారు.





పవన్ హామీ ఇచ్చిన మరుసటి రోజే సర్వే చేసిన అధికారులు


ఈ హామీ అమలు మేరకు తర్వాత రోజు నుంచే గుడివాడ నియోజకవర్గంలో కలుషిత నీరు బారిన పడిన గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా శాఖ యంత్రాంగాన్ని నీటి పరీక్షలు చేయాలని పవన్ కల్యాణ్  ఆదేశించారు. దాదాపు అన్ని గ్రామాల్లోనూ నీటి పరీక్షలు చేసిన అనంతరం రక్షిత తాగునీరు సరఫరాలోని లోపాలను అధికారులు గుర్తించారు. సత్వరమే పనులు మొదలు పెట్టేందుకు నందివాడ మండలంలో 12 పనులు గుర్తించి రూ.91 లక్షలు కేటాయించి నిధులు విడుదల చేసారు. 


అంచనాలు తయారు చేసి నిధుల విడుదలకు ప్రతిపాదనలు


తాగు నీటిని శుద్ధి చేసే ఫిల్టర్ బెడ్ల నిర్మాణం, మరమ్మతులు చేసేందుకు నిధులు కేటాయించారు. వెంటనే ఈ పనులు మొదలుపెట్టాలని ఆర్ డబ్ల్యూఎస్ అధికారులకు పవన్ ఆదేశాలు కూడా ఇచ్చారు.  మిగిలిన గ్రామాల్లో సైతం తాగు నీటి ప్లాంట్ల మరమ్మతులపై దృష్టిపెట్టి వాటికి సంబంధించిన అంచనాలను సత్వరమే రూపొందించాలని ఆదేశించారు. 


సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాల్లో మొదటగా పనులు 
 
మొదటిగా సమస్య తీవ్రత అధికంగా ఉన్న  గ్రామాలపై దృష్టి పెట్టారు. నంది వాడ మండలంలోని  గ్రామాల్లో ఫిల్డర్ బెడ్లు, సరఫరాలో లోపం లేకుండా అవసరమైన పనులు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్  బాలాజీ నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు కూడా ఇచ్చారు.  





 గుడివాడ నియోజకవర్గానికి  కొడాలి నాని చాలా కాలం ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు. దీంతో ఇటీవల ఎన్నికల్లో ఆయన యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.