Police Lotty Charge On Portesters: సికింద్రాబాద్‌లో (Secunderabad) తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ముత్యాలమ్మ ఆలయంలో (Mutyalamma Temple) విగ్రహ ధ్వంసంపై వీహెచ్‌పీ, హిందూ సంఘాలు, బీజేపీ కార్యకర్తల ర్యాలీలో ఘర్షణ తలెత్తింది. నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ర్యాలీని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపైకి నిరసనకారులు కుర్చీలు, చెప్పులు, వాటర్ ప్యాకెట్లు విసిరారు. మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించిన ఆందోళనకారులకు డీసీపీ రష్మీ పెరుమాళ్ నచ్చచెప్పినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారుల్లో కొందరి తలలకు, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. లాఠీఛార్జ్‌లో తన ఎడమ చెయ్యి విరిగిందంటూ ఓ యువకుడు నేలపై కూలబడ్డాడు.
మరోవైపు, మత ఘర్షణలు తలెత్తకుండా సికింద్రాబాద్‌లో ముందు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్ నిలిపేసినట్లు తెలుస్తోంది. కాగా, ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన ఘటనకు నిరసనగా సికింద్రాబాద్‌లో శనివారం బంద్‌కు పిలుపునిచ్చారు. వ్యాపారులు, స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. హిందూ సంఘాలు, స్థానికులు మహంకాళి ఆలయం నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకూ ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో అలర్ట్ అయిన పోలీసులు ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మహంకాళి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించడం, అనంతరం ర్యాలీతో ఉద్రిక్తత పెరిగే క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులు నచ్చజెప్పినా వినకపోవడంతో వాగ్వాదం జరిగి లాఠీఛార్జ్‌కు దారితీసింది.
లాఠీఛార్జ్‌పై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం
అటు, ముత్యాలమ్మ ఆలయం వద్ద హిందూ సంఘాలపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. మతపరమైన మనోభావాలపై దాడి జరిగినప్పుడు, విగ్రహాలను అపవిత్ర చేసినప్పుడు శాంతియుతంగా నిరసన చేయడానికి కూడా అనుమతించకపోవడం తీవ్ర కలకలం రేపుతోందన్నారు. 'ఈ లాఠీఛార్జ్‌కు ఎవరు ఆదేశించారు.? ఆలయాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి తప్ప న్యాయం కోరే భక్తులపై కాదు. మా విశ్వాసంపై జరిగిన ఈ దాడికి మేము జవాబుదారీతనం, న్యాయాన్ని కోరుతున్నాం.' అని రాజాసింగ్ పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే.?
ఈ నెల 14న (సోమవారం) అర్ధరాత్రి సమయంలో సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అమ్మవారి ఆలయంలోకి చొరబడి మరీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ తతంగమంతా అక్కడి సీసీ ఫుటేజీలో నమోదైంది. ఈ ఘటనపై స్థానికులు, హిందువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసి హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ మండిపడ్డారు. ఆనాడు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయం వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులకు సద్దిచెప్పేందుకు యత్నించారు. పోలీసులు, నిరసనకారులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆలయం వద్దకు చేరుకుని సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి పరిశీలించారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. దీనిపై ఫిర్యాదు అందుకుని విచారించిన పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Crime News: తెలంగాణలో దారుణం - తలపై బాది గొంతు కోసి వృద్ధ దంపతులను చంపేశారు, ఎక్కడంటే?