Alluri Sitarama Raju District News: వారంతా చెడు వ్యవసనాలకు అలవాటు పడ్డారు. ఆదాయం కోసం అడ్డదారులు వెతకడం మొదలుపెట్టారు. ఈజీ మనీ కోసం గంజాయి అమ్మాలని భావించారు. గంజాయి తరలించేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు పట్టుబడ్డారు. చింతపల్లి సబ్ డివిజన్ పరిధిలో సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒడిశా రాష్ట్రం నుంచి మహారాష్ట్ర తరలిస్తున్న 350 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. గంజాయి నివారణలో భాగంగా చింతపల్లి సబ్ డివిజన్ అధికారి ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో, జీకే వీధి సీఐ అశోక్ కుమార్, సీలేరు ఎస్ఐ రామకృష్ణ గురువారం వాహనాల తనిఖీలు చేపట్టారు. 


ఈ క్రమంలో గురువారం సాయంత్రం TRC క్యాంప్ జంక్షన్ 353 కేజీల గంజాయితో వెళ్తున్న ఐదుగురు ముఠాను పోలీసులు పట్టుకున్నారు. శుక్రవారం నిందితుల అరెస్ట్ చూపించారు. పోలీసులు వివరాలు వెల్లడిస్తూ.. నిందితులు చెడువ్యసనాలకు అలవాటుపడ్డారని చెప్పారు. వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బులు సరిపోకపోవడంతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చింతపల్లి క్యాంప్‌కు చెందిన  కొర్ర దారబాబు, కొర్ర జగ్గారావు,  సిసా లైకాన్, కిల్లో రాజు, వంతల త్రినాథ్,  A. అంకటేస్ కలిసి ఒక గ్రూపుగా ఏర్పడ్డారు. 


గంజాయి కోసం బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారి దగ్గర డబ్బులు తీసుకొని, వారికి గంజాయి సరఫరా చేసేవారు. ఈ క్రమంలో ఈ నెల 18న సూరజ్ అనే మహారాష్ట్రకు చెందిన కమరున్నీసా సికందర్ అలియాజ్ (సూరజ్),   చింతపల్లి క్యాంప్‌కు చెందిన ధారబాబుకి  ఫోన్ చేసి 350 కేజీలు గంజాయి కావాలని అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య డీల్ జరిగింది. ధారబాబు, జగ్గారావు, లైకాన్ ఒడిశా వెళ్లి కెందుగూడ, పసుపులంక ప్రాంతాల్లో దారబాబుకి పరిచయం ఉన్న వ్యక్తుల దగ్గర 350 కేజీలు గంజాయిని కేజీ Rs.1000 చొప్పున కొనుగోలు చేశారు. 


గురువారం లైకోన్ పూర్‌కి తెచ్చి చందూరుపల్లికి చెందిన కిల్లో రాజు, చింతపల్లి క్యాంపుకి చెందిన వంతల త్రినాథ్‌ల సాయంతో  12 గోనె సంచుల్లో ప్యాక్ చేయించారు. గురువారం మధ్యాహ్నం టయోటా కారులో 12 గోనె సంచుల గంజాయిని ఎక్కించి వెళ్లి భద్రాచలంలో సికిందర్‌కు అప్పగించేందుకు బయల్దేరారు. ఈ క్రమంలో TRC క్యాంపు దగ్గర పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని 353 కేజీల 12 గంజాయి మూటలు, టయోటా కారు, 3 మొబైల్ ఫోన్లు, రూ:3000 నగదు సీజ్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం చింతపల్లి కోర్టుకు తరలించారు. 
 
గంజాయి ప్రభావిత గ్రామాల్లో తరచూ చింతపల్లి సబ్ డివిజనల్ అధికారి ప్రతాప్ శివకిషోర్ ఆధ్వర్యంలో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గంజాయి సాగు చేపట్టవద్దని, క్రయవిక్రయాలు చేయొద్దని సూచిస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దంటూ పోలీసులు వివరిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాకు దూరంగా ఉండమని గ్రామాల్లో పదే పదే ప్రచారం చేస్తున్నారు. గంజాయి కేసులో పట్టుబడితే జైలుకు తరలించడంతో పాటుగా వారి ఆస్తులు కూడా జప్తు చేస్తామని హెచ్చరిస్తున్నారు. అయినా కొందరిలో మార్పు కనిపించడం లేదు. ఈజీ మనీ కోసం కొందరు గంజాయి రవాణాకు పాల్పడుతున్నారు. గంజాయి గ్యాంగ్ అరెస్ట్ చేయడంలో ప్రతిభ కనబరిచిన గూడెం కొత్త వీధి ఇన్‌స్పె‌క్టర్ అశోక్ కుమార్, సీలేరు ఎస్ఐ రామకృష్ణ, సీలేరు పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అభినందించారు.