Woman Abused And Murdered In East Godavari: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. తిరుపతి జిల్లా వడమాలపేటలో మూడున్నరేళ్ల చిన్నారిపై ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి చంపేశాడు. చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అటు, తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళపై నలుగురు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన దారుణ ఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాలోని పర్లాఖెముండి ప్రాంతానికి చెందిన దంపతులు చాలాకాలం క్రితం కడియం మండలంలోని ఓ గ్రామానికి వచ్చి నర్సరీల్లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ప్రత్యేక ప్రతిభావంతురాలైన కుమార్తెతో పాటు డిగ్రీ చదివే కుమారుడు ఉన్నారు. గత నెల 15న మహిళ అదృశ్యం కాగా.. 16న కడియం పీఎస్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారించగా తర్వాత రోజు ఆలమూరు మండలం చొప్పెల్ల వద్ద కాలువలో ఆమె మృతదేహం గుర్తించారు. 


సామూహిక అత్యాచారం, హత్య


మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నలుగురు నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు విచారణలో తేల్చారు. అక్టోబర్ 15వ తేదీన మహిళ నర్సరీలో పనులు ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా.. బుర్రిలంకకు చెందిన దేవర యేసు (26), వెలుబుడి ప్రవీణ్ (21), లోకిన జయప్రసాద్ (19), పొట్టిలంకకు చెందిన దాసరి సురేష్ (22) దారి కాచి బలవంతం చేశారు. ఆమె ప్రతిఘటించడంతో సమీపంలోని మొక్కల్లోకి లాక్కెళ్లి నోట్లో తువ్వాలు కుక్కారు. ఆమె స్పృహ కోల్పోవడంతో నిందితులు పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అనంతరం రాత్రి 9 గంటలకు ఆమెను సమీపంలోని పంట కాలువలో పడేసి పరారయ్యారు. అయితే, మహిళ అప్పటికే మృతి చెందారా.?, లేక కాలువలో పడేసిన తర్వాత చనిపోయారా.? అనేది పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తెలుస్తుందని పోలీసులు తెలిపారు.


నిందితులను పట్టించిన నల్లపూసల దండ


నర్సరీల వద్ద మృతురాలి కుమారుడి స్నేహితులకు నల్లపూసల దండ, గాజులు, రుమాలు, పిన్నులు కనిపించాయి. అయితే, ఘటన జరిగినప్పటి నుంచి పనులకు హాజరు కాని వారి గురించి పోలీసులు ఆరా తీయగా.. దేవర యేసు తెరపైకి వచ్చింది. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా ఆ వివరాలతో మిగిలిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురినీ రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు నిత్యం గంజాయి, మద్యం మత్తులో ఉంటారని స్థానికులు, పోలీసులు చెప్పారు. యేసు పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.


ప్రియురాలి ఇంట్లో ప్రియుడి ఆత్మహత్య


ప్రియురాలి ఇంట్లోనే ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కృష్ణా జిల్లా ఉయ్యూరులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యూరుకు చెందిన చందా మాధవరాజు (30), ఓ యువతి ప్రేమించుకున్నారు. ఇద్దరికీ మనస్ఫర్థలు వచ్చి 2021లో విడిపోయారు. అయితే, శుక్రవారం రాత్రి యువకుడు.. యువతి ఇంటికి వెళ్లాడు. తనకు యువతిని ఇచ్చి పెళ్లి చేయాలని వారి కుటుంబ సభ్యులను అడిగాడు. వారు నిరాకరించడంతో ఇంటి వరండాలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: Andhra Pradesh News: నడిరోడ్డుపై ఉరి తీస్తే బుద్ది వస్తుంది- ఆడపిల్లలపై చెయ్యి వేసే వాళ్లకు చంద్రబాబు స్ట్రాంగ్ వారింగ్